హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెయిన్ వాటర్ డ్రైన్లో మురుగు కలవకుండా ట్రంక్ మెయిన్ల అభివృద్ధిపై జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ కలిసి కమిషనరేట్ పరిధిలో పర్యటించారు.
చెరువుల పరిరక్షణలో భాగంగా దుర్గం చెరువు నుంచి ఇబ్రహీం చెరువు వరకు ఉన్న ప్రాంతంలో ఏ చెరువులోనూ మురుగు చేరకుండా.. మల్కం చెరువు నుంచి నెక్నంపూర్ వరకు బాక్స్ డ్రైన్, సీవరేజ్ ట్రంక్ మెయిన్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. చిత్రపురి కాలనీ ఎస్టీపీ, ఖాజా కుంట ఎస్టీపీ, నానక్ రామ్ గూడ ఎస్టీపీ, నెక్నంపూర్ లోని ఇబ్రహీమ్ చెరువు వరకు చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఆఫీసర్లు మాట్లాడుతూ.. కమిషనరేట్‌లో ఉన్న అన్ని సీవరేజ్ లైన్లను సర్వే చేసి, ఎక్కడెక్కడి నుంచి మురుగునీరు వాననీటి కాల్వల్లోకి చేరుతోందో మ్యాపింగ్ చేయాలని సూచించారు.
అన్ని సీవరేజ్ ప్రవాహాలను ఎస్‌టీపీలకు మళ్లించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం కోసం వినియోగదారుల డిమాండ్ అంచనా వేయాలని సూచించారు. శుద్ధి చేసిన నీటి నిల్వ కోసం ట్రీటెడ్ వాటర్ సంప్ ఏర్పాటు చేయాలన్నారు. జలమండలి ప్రాజెక్టు సీజీఎంలు పద్మజ, సుజాత, సీఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీ లక్ష్మి, ఇరిగేషన్ ఈఈ మల్లేశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
