బీఆర్ఎస్వి రాజకీయ యాత్రలు.. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు: మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్వి రాజకీయ యాత్రలు.. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు: మంత్రి శ్రీధర్ బాబు
  • బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ వికారాబాద్​ వెనుకబడ్దది
  • అభివృద్ధిని చూసి ఓర్వలేకే మొసలి కన్నీళ్లు 
  • కొడంగల్, కోస్గి, దోమ, పరిగి ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు 
  • ఆర్​ఆర్​ఆర్, రేడియల్​ రోడ్లు
  • భూసేకరణ చట్టం ప్రకారమే ల్యాండ్స్​ తీసుకుంటున్నామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రైతుల దీక్షకు సంఘీభావం పేరిట బీఆర్​ఎస్​ పార్టీ పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేలా రాజకీయాలు చేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న భూసేకరణపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ యాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో తీవ్ర వెనుకబాటుకు గురైన వికారాబాద్‌‌‌‌‌‌‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకే మొసలి కన్నీరు కారుస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని, దాన్ని చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

పెట్టుబడులు రాకుండా.. యువతకు ఉపాధి దక్కకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ‘‘కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భూములు అవసరం. ఇప్పటికే ఆపరేషన్‌‌లో ఉన్న చందనవెల్లి, సీతారాంపూర్​ ఇండస్ట్రియల్ పార్కుల్లో కొత్త యూనిట్లు కేటాయించేందుకు భూములు అందుబాటులో లేవు. కొన్ని చోట్ల ఉన్నా పలు ఇబ్బందులు ఉన్నాయి.  ఇలాంటి తరుణంలోనే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం’’ అని వివరించారు. 

అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామికాభివృద్ధి

పారిశ్రామికాభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, పరిగి తదితర ప్రాంతాలను ఎంపిక చేశామని శ్రీధర్​ బాబు తెలిపారు. కొడంగల్, కోస్గి, దోమ, పరిగి తదితర ప్రాంతాల కనెక్టివిటీని పెంచేందుకు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రేడియల్ రోడ్డు, ఆర్​ఆర్​ఆర్​ను ప్రతిపాదించామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో అవసరమైన మేరకు, నిబంధనలకు కట్టుబడి భూసేకరణ చేస్తామని చెప్పారు. 

భూ సేకరణ చట్టం 2013 ప్రకారం డీపీఆర్​ను తయారు చేసి, ప్రభుత్వం నుంచి 10-ఏ జీవో తీసుకున్న తర్వాతే పరిగి మండల పరిధిలోని రాపోల్, కాడ్లాపూర్ లో భూసేకరణకు నోటిఫికేషన్ ను జారీ చేయాలని కలెక్టర్ ను టీజీఐఐసీ కోరిందని ఆయన తెలిపారు. ‘‘భూముల్ని కోల్పోయిన వారికిచ్చే నష్ట పరిహారం విషయంలో బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. 

చట్ట ప్రకారం నష్ట పరిహారం, ఆర్​ అండ్​ ఆర్​ బెనిఫిట్ కింద ఇండ్ల స్థలాల్ని అందజేస్తున్నాం. ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్ ప్రాంత రూపురేఖల్ని మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడికి పరిశ్రమలొస్తే మీ బిడ్డలకు ఉద్యోగాలొస్తాయి. వలసలు ఆగిపోతాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుతాయి’’అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.