న్యూఢిల్లీ: పిల్లల విషయంలో దేశ ప్రజల ఆలోచన విధానం మారుతోంది. ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించిన ప్రజలు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరూ విధానాన్ని అవలంభిస్తు్న్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న జీవన వ్యయం, ఆర్థిక భారాలకు భయపడి కొందరు పిల్లల విషయంలో మొత్తానికే వెనకడుగు వేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) గణాంకాలే ఇందుకు నిదర్శనం.
ఈ సర్వే డేటాను ఉటంకిస్తూ ఏఎఫ్ పోస్ట్ మీడియా సంస్థ సోషల్ మీడియాలో ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశ జాతీయ సంతాన ఉత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) 1.9కి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఉండాల్సిన రీప్లేస్మెంట్ రేటు 2.1 కంటే టీఎఫ్ఆర్ దిగువకు పడిపోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
పట్టణ ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ జాతీయ సగటు కంటే తక్కువగా 1.5కి పడిపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎఫ్ 2.1గా ఉంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఢిల్లీలో అత్యల్పంగా 1.2, కేరళ, తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.3గా నమోదైంది. బీహార్ (2.9), ఉత్తర ప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో మాత్రం జాతీయ సగటు 2.1 కంటే ఎక్కువగా టీఆర్ఎఫ్ నమోదు కావడం గమనార్హం.
ఈ రెండు రాష్ట్రాలు మినహా దేశంలోని మిగిలిన మెజారిటీ రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు చేరుకుంది. ఈ డేటాను నిశీతంగా పరిశీలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజల కంటే పట్టణవాసులు జనాభా నియంత్రణను ఎక్కువగా పాటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఏఎఫ్ మీడియా సంస్థ నివేదికలో ఏముందంటే..?
భారత దేశ చరిత్రలో మొదటిసారిగా దేశ జననాల రేటు జనాభా స్థిరంగా ఉండాలంటే ఉండాల్సిన రీప్లేస్మెంట్ రేటు 2.1 కంటే దిగువకు పడిపోయిందని నివేదికలో తెలిపింది. కేవలం ఒక దశాబ్దంలోనే మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ప్రస్తుతం దేశ ఢిల్లీ సంతానోత్పత్తి రేటు 1.2గా నమోదైంది. ఇది ఫిన్లాండ్ దేశ జననాల రేటు కంటే తక్కువ అని పేర్కొంది.
ఎలాన్ మస్క్ రియాక్షన్
భారతదేశ జనన రేటు తగ్గుదలపై స్పేస్‌ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యాడు. ఏఎఫ్ పోస్ట్ మీడియా సంస్థ డేటాను ఉటంకిస్తూ.. భారతదేశ జననాల రేటు పునఃస్థాపన స్థాయి కంటే దిగువకు పడిపోయిందని పేర్కొన్నారు. విద్యావంతులలో సంతానోత్పత్తి రేటు చాలా సంవత్సరాల క్రితమే దేశ సగటు కంటే తక్కువకు పడిపోయిందని అన్నారు.
India’s birth rate has fallen below replacement.
— Elon Musk (@elonmusk) June 6, 2026
Among those most educated, India’s birth rate fell below replacement many years ago. https://t.co/RsWf0PK6wx
