IND vs ENG 2025: ఆ ఇద్దరిపై వేటు కన్ఫర్మ్.. చివరి టెస్టుకు నాలుగు మార్పులతో టీమిండియా

IND vs ENG 2025: ఆ ఇద్దరిపై వేటు కన్ఫర్మ్.. చివరి టెస్టుకు నాలుగు మార్పులతో టీమిండియా

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం (జూలై 31) లండన్ లోని ఓవల్ వేదికగా చివరిదైన ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ చివరి టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి.. రెండు కాదు ఏకంగా నాలుగు మార్పులతో గిల్ సేన ప్లేయింగ్ 11 ప్రకటించబోతుంది. పాదం గాయం కారణంగా ఇప్పటికే వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధికారికంగా చివరి టెస్టుకు దూరమయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా ఫాస్ట్ బౌలర్ బుమ్రా సైతం చివరి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘోరంగా విఫలమైన శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్ లపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. 

ALSO READ | IND vs ENG 2025: ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు బుమ్రా ఔట్.. తుది జట్టులో ఆకాష్ దీప్

ఓపెనర్లుగా జైశ్వాల్, కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ను ఆరంభిస్తారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ కు మరో ఛాన్స్ దక్కొచ్చు. నాలుగో స్థానంలో కెప్టెన్ గిల్ ఆడతాడు. ఐదో స్థానంలో పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. ఆరు, ఏడు స్థానాల్లో వరుసగా మాంచెస్టర్ సెంచరీ వీరులు జడేజా, సుందర్ బ్యాటింగ్ కు వస్తారు. శార్దూల్ ఠాకూర్ ని చివరి టెస్టులో పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడించే ప్రయత్నాలు టీమిండియా చేస్తున్నట్టు సమాచారం. ఈ సిరీస్ లో రెండు టెస్టులాడిన ఈ ముంబై పేసర్ ఘోరంగా విఫలమయ్యాడు. 

జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 లో కి రానున్నాడు. నాలుగో టెస్టుకు దూరమైన ఆకాష్ పూర్తి ఫిట్ నెస్ సాధించి చివరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో కాంబోజ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. బుమ్రా లేకపోవడంతో సిరాజ్ ప్రధాన బౌలర్ గా భారత జట్టును నడిపించనున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 బుధవారం (జూలై 30) ప్రకటించనున్నారు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. 

ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్