- బాండెడ్ లేబర్ పునరావాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
- అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తం
- గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించే చట్టాన్ని తెచ్చాం
- వెట్టిచాకిరిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిదని సూచన
- బాండెడ్ లేబర్ వ్యవస్థ రూపం మార్చుకుంటోంది: మంత్రి సీతక్క
- అమీర్‌పేట్‌లో మానవ అక్రమ రవాణ, వెట్టిచాకిరి నిర్మూలన సదస్సు
హైదరాబాద్, వెలుగు: వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన బాండెడ్ లేబర్‌కు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు రాకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇండ్లు ఇవ్వడంతో పాటు బాధితుల పునరావాసానికి అవసరమైన కార్పస్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.
ఇందుకోసం ప్రత్యేక జీవో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ‘తెలంగాణలో మానవ అక్రమ రవాణ, వెట్టిచాకిరి నిర్మూలన 2026’ అనే అంశంపై అమీర్‌పేటలోని మారీగోల్డ్ హోటల్‌లో శనివారం సదస్సు జరిగింది. రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్తంగా నిర్వహించిన స్టేట్ కన్వర్జెన్స్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమంలో.. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెట్టిచాకిరి, చైల్డ్ లేబర్ సమాజానికి చాలెంజ్‌గా మారాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఇందుకు సామాజిక సంస్థలు, అధికారులు సహా సమిష్టికృషి జరగాలని, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘నేను లేబర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. 2021 =25 మధ్య రాష్ట్రవ్యాప్తంగా కనీసం 673 మంది కార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాం.
బాల కార్మిక వ్యవస్థ చిన్నారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పోలీసులు ఈ అంశాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా సానుభూతితో చూడాలి. మన ఇంటి పిల్లల్ని ఎలా చూస్తామో వారిని కూడా అలాగే చూడాలి. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ (8069434343)ను ప్రారంభించడం కీలక ముందడుగు’ అని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
చెంచుల జనాభా తగ్గిపోతోంది: మంత్రి సీతక్క
సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వెట్టిచాకిరి వ్యవస్థ రూపం మార్చుకుంటోందన్నారు. పేదరికాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు బాధిత కుటుంబాలను నిర్భంద కార్మికులుగా మారుస్తున్నాయని వాపోయారు. బాలికలను, మహిళలను లైంగికంగా హింసిస్తున్న ఘటనల గురించి విన్నప్పుడు ఎంతో ఆవేదన కలుగుతోందన్నారు. రాష్ట్రంలో చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో చెంచుల ఉనికే ప్రమాదంలో పడనుందని చెప్పారు.
వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన చెంచు మహిళ దాసరి శివమ్మ కోరినట్టుగా వారి గ్రామానికి రవాణా సదుపాయం కోసం మహిళా సంఘం ద్వారా ఆటో కొనుగోలు చేసి ఇస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాండెడ్ లేబర్‌ను వ్యవస్థీకృత నేరంగానే పరిగణిస్తామన్నారు. బాధితులను కాపాడడంతోపాటు ఈ నేరంలో ఉండే ముఠాలపై నిఘా పెట్టి వాటి మూలాలను దెబ్బతీస్తున్నట్టు తెలిపారు.
స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ.. తాను యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఇటుకబట్టీలలో వెట్టిచాకిరి చేస్తున్న వారిని కాపాడడంతోపాటు వారి పిల్లల కోసం ఒడిశా టీచర్లతో బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ చారుసిన్హా మాట్లాడుతూ.. ఆర్థిక అవసరాలను ఆయుధంగా చేసుకుని ఎంతో మంది అమాయకులను నిర్భంధ కార్మికులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు.
మా ఊరును మళ్లీ చూస్తామనుకోలేదు..
మాది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంట గ్రామం. రాజస్తాన్ ఎడారిలో ఏండ్లపాటు చిక్కుకుపోయి దుర్భర జీవతం గడిపాం. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. బాబు పుట్టిన తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యాను. పని పేరుతో మమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన్రు. రాత్రి రైలు ఎక్కించి రాజస్తాన్ తీసుకుపోయిన్రు. అక్కడ ఎడారిలో రోడ్డువేసే పనిలో పెట్టారు.
మొత్తం 50 మందిమి అక్కడే మూడేండ్లు సరిగా తిండి కూడా లేకుండా బతికినం. మావాళ్లు ముగ్గురు తప్పించుకుని వచ్చిన్రు. వాళ్ల విషయం తెలుసుకుని మమ్మల్ని అక్కడి నుంచి తప్పించి వారం రోజులు ఊర్లు తిప్పుకుంటా తమిళనాడుకు తీసుకొచ్చిన్రు. మళ్లీ జీవితంలో మా ఊరు చూస్తాం అనుకోలేదు.
వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన దాసరి శివమ్మ

