గుడ్ న్యూస్: ఉగాదిలోపే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు

గుడ్ న్యూస్: ఉగాదిలోపే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు
  •     హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మంజూరు
  •     18 వేల మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్లలో వెల్లడి
  •     వారంపాటు అప్లికేషన్ల రీ వెరిఫికేషన్
  •     మరో 28 వేల మందికి 

హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ( క్యూర్ –కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ )  పరిధిలో సొంత జాగాలు ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నది. ఉగాదిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ 3 జిల్లాలు, జీహెచ్ఎంసీ ప్రజా పాలనలో ఇంటికోసం వచ్చిన అప్లికేషన్లను అధికారులు షార్ట్ లిస్ట్ చేయగా.. ఇందులో 18 వేల మంది అర్హులని తేలారు. ఈ అప్లికేషన్లను అధికారులు  రీ వెరిఫికేషన్ చేయనున్నారు.  ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని  అధికారులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్  ఆదేశించారు. కాగా, ఈ వెరిఫికేషన్ బాధ్యత మూడు కమిషనరేట్ల ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్లు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరో 28 వేల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వనున్నారు. సొంత జాగా, సొంత ఇండ్లు లేని పేదలకు జంటనగరాల్లో నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఇండ్లను అందజేయనున్నారు. మార్చ్ 31 నాటికి ఈ ఇండ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని మూడు జిల్లాల కలెక్టర్లను, ముగ్గురు కమిషనర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. అలాగే, రోడ్డు, తాగు నీరు, పెద్ద కాలనీలు ఉన్న దగ్గర స్కూల్‌‌‌‌లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ రెండూ కలిపి క్యూర్ పరిధిలో వచ్చే నెలాఖరు వరకు 50 వేల మందికి ఇండ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

జీహెచ్‌‌‌‌ఎంసీలో 12 లక్షల అప్లికేషన్లు..

ఇందిరమ్మ ఇండ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఇప్పటివరకూ 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. 2.50 లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి.  వచ్చే నెలాఖరు వరకు లక్ష ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాల్లో సైతం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పీఎం ఆవాస్ స్కీమ్‌‌‌‌లో కేంద్రం ఇప్పటికే లక్షా 13 వేల ఇండ్లను మంజూరు చేసింది. అయితే, జీహెచ్ఎంసీలో  ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం 12 లక్షల అప్లికేషన్లు రాగా.. ఇందులో సొంత జాగా ఉన్న లబ్ధిదారులు 18 వేల మంది మాత్రమే ఉన్నారు. జీహెచ్ఎంసీ  ఏరియాలో 100 గజాల జాగా ఉన్న దానిని కబ్జా కాకుండా కాపాడుకోవటం కత్తి మీద సాము లాంటింది. దీంతో సొంత జాగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇక్కడ ఇండ్లను మంజూరు చేయలేదు.  స్లమ్ ఏరియాల్లో జీప్లస్ 3 లేదా 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.