ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు : పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల  బిల్లుల చెల్లింపులో మార్పులు : పొంగులేటి
  • లబ్ధిదారుడి ఖాతాలోకే ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ నిధులు: పొంగులేటి 
  • ఇకపై స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1.60 లక్షలు చెల్లిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారులకు నాలుగు విడతలుగా అందజేస్తున్న బిల్లుల చెల్లింపు ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇండ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద టాయిలెట్ల నిర్మాణ పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పులు చేసినట్టు తెలిపారు.

 ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్‌‌లో మాత్రమే మార్పులు చేశామని , లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం బేస్‌‌మెంట్ వరకు పూర్తయితే రూ.లక్ష, స్లాబ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష,  స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు చెల్లిస్తున్నం. 

అయితే ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పథకాల కింద కలుగుతున్న లబ్ధి (90 పని దినాలు, టాయిలెట్ల నిర్మాణం)కి సంబంధించిన నిధులు రూ.60 వేలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే జమవుతాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఇంటి స్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తం ఇప్పటి వరకు రూ. 2 లక్షలు ఉండగా, ఇకపై రూ.1.60 లక్షలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని వెల్లడించారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష విడుదల చేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ మార్పులను గమనించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.