- మొత్తం 7 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం
- సిరిసిల్లతో పాటు గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, యాదాద్రి జిల్లాల నేతన్నలకూ ఆర్డర్
- నేత కార్మికులకు మరో ఆరు నెలల పాటు ఉపాధి
- మొదటి చీర డబ్బులు రూ.140 కోట్లు విడుదల
రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందచేసే ఇందిరమ్మ చీరల్లో రెండో చీర ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందిరా మహిళా శక్తి స్కీం కింద రాష్ట్రంలోని మహిళకు రెండు చీరలు ఇస్తామన్న ప్రభుత్వం ఇందుకు లైట్‌బ్లూ, ప్యారెట్ గ్రీన్ కలర్లను ఎంపిక చేసింది. ఇందులో మొదటి చీర పంపిణీ ఇప్పటికే పూర్తి కాగా.. రెడ్ బార్డర్, ప్యారెట్ గ్రీన్ కలర్‌తో ఉన్న రెండో చీర ఉత్పత్తిని సిరిసిల్ల నేతన్నలు తాజాగా ప్రారంభించారు.
సిరిసిల్లతో పాటు మిగతా ప్రాంతాలకూ ఆర్డర్
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్‌ను మొదటి నుంచీ ఇక్కడి నేతన్నలకే కేటాయిస్తూ వస్తోంది. కానీ ఈ సారి 80 శాతం క్లాత్ ఉత్పత్తి ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం.. మిగతా 20 శాతం క్లాత్ ఉత్పత్తి అవకాశాన్ని గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాల్లోని నేతన్నలకు అప్పగించింది. అందరూ కలిసి మొత్తం 7 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలోని 130 మ్యాక్స్ సొసైటీలు కలిసి 80 శాతం క్లాత్‌ను ఉత్పత్తి చేయనున్నాయి.
నేతన్నలకు ఏడాదంతా ఉపాధి
ఇందిరమ్మ మహిళా శక్తి స్కీం కింద చీరల ఉత్పత్తి ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు ఇస్తుండడంతో వారికి ఏడాదంతా పని దొరుకుతోంది. మొదటి చీర ఉత్పత్తి కోసం గతేడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఆర్డర్‌తో నేత కార్మికులకు ఆరు నెలల పాటు ఉపాధి లభించింది. ప్రస్తుతం ఇందిరమ్మ రెండో చీర ఉత్పత్తి కోసం మళ్లీ ఆర్డర్ ఇవ్వడంతో స్థానిక కార్మికులకు మరో ఆరు నెలల పాటు చేతినిండా పని దొరకనుంది.
వెంట వెంటనే నిధులు విడుదల
ఇందిరమ్మ చీరలకు సంబంధించి క్లాత్ ఉత్పత్తి పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు డిపాజిట్ చేస్తోంది. మొదటి చీర ఉత్పత్తి పూర్తి చేసిన నేతన్నలకు ఇప్పటికే సుమారు రూ. 140 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించుకుని రూ. 370 కోట్లు బకాయి పెట్టడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పాత బకాయిలతో పాటు కొత్తగా చేసిన పనికి సైతం వెంట వెంటనే డబ్బులు విడుదల చేస్తుండడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
15 రోజుల్లో 31 లక్షల క్లాత్ ఉత్పత్తి
ఇందిరమ్మ చీరల క్లాత్ ఉత్పత్తి స్పీడ్‌గా సాగుతోంది. ఈ నెల 7 ఆర్డర్ అందుకున్న నేతన్నలు 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. కేవలం 15 రోజుల్లోనే సుమారు 31 లక్షల మీటర్ల క్లాత్‌ను ఉత్పత్తి చేశారు. మొత్తం క్లాత్ ఉత్పత్తి ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. చేనేత శాత ఏడీ సంతోశ్‌తో పాటు ఇతర ఆఫీసర్లు ఎప్పటికప్పుడు నేతన్నలతో మాట్లాడుతూ క్లాత్ ఉత్పత్తిపై సమీక్షిస్తున్నారు.
