పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా బ్యాన్ 

పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా బ్యాన్ 

న్యూఢిల్లీ: మన దేశంలో ఇప్పటికే వంట నూనెల రేట్లు మండిపోతుండగా.. అవి మరింత పెరిగే అవకాశముంది. పామాయిల్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే ఇండోనేషియా.. దాని ఎగుమతులపై ఈ నెల 28 నుంచి నిషేధం విధించాలని నిర్ణయించింది. ధరలను తగ్గించడానికి వంట నూనెలతో పాటు ముడి సరుకుల షిప్​మెంట్లను కూడా నిలిపేస్తామని ప్రెసిడెంట్​ జోకో విడోడో ప్రకటించారు.

తమ దేశంలో ఆహార పదార్థాలు, వంట నూనెలకు కొరత లేకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ‘‘ఇండోనేషియా నుంచి మన దేశం ఎక్కువగా పామాయిల్ కొంటోంది. ఆ దేశం పామాయిల్ ఎగుమతులను బ్యాన్​ చేయడం వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ నూనెల ధరలు పెరుగుతాయి. ఇండోనేసియా ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం” అని సాల్వెంట్ ఎక్స్​ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది అన్నారు. 
50 శాతం వాటా ఇండోనేషియాదే.. 
ఇండోనేషియాతో పాటు మలేషియాలోనూ పామాయిల్ ఉత్పత్తి​తగ్గింది. డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి పామాయిల్ ధరలు బాగా పెరిగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారీగా ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ ​నుంచి కూడా సప్లై ఆగిపోవడంతో ఆ నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇక నుంచి వంట నూనెల ధరల పెరుగుదలకు ఆకాశమే హద్దు అని ముంబైకి చెందిన ఒక డీలర్​అన్నారు. పామాయిల్​ఎగుమతుల్లో 50 శాతం వాటా ఇండోనేషియాదే! ఉక్రెయిన్‌‌ యుద్ధంతో సన్‌‌ ఫ్లవర్‌‌ ఆయిల్‌‌ దిగుమతులు పడిపోవడంతో పామాయిల్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.