
- ప్రకటించిన ఇండస్ టవర్స్
హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.73 కోట్ల మందికి మేలు జరిగిందని టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇండస్ టవర్స్ ప్రకటించింది. సాక్షమ్, ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించామని తెలిపింది.
డిజిటల్ ఇండియా, బేటీ బచావో–బేటీ పఢావో, స్కిల్ ఇండియాతో పాటు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సీఎస్ఆర్ వ్యూహాన్ని రూపొందించుకున్నామని తెలిపింది. 2030 నాటికి 15 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఇండస్ టవర్స్ సీహెచ్ఆర్ఓ పుష్కర్ సింగ్ కటారియా తెలిపారు.
‘‘ఇండస్ టవర్స్ మహిళల సంక్షేమానికి కృషి చేస్తోంది. వారికి అవసరమైన ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్య సౌకర్యాలను అందిస్తోంది. విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఎదిగేలా తీర్చిదిద్దుతోంది”అని అన్నారు. త్వరలో తాము విదేశీ మార్కెట్లలోకి కూడా వెళ్తామని ఇండస్ తెలిపింది.