డబుల్ బెడ్ రూం ఇండ్లలో.. అనర్హుల ఏరివేత షురూ

డబుల్ బెడ్ రూం ఇండ్లలో.. అనర్హుల ఏరివేత షురూ
  • టీజీఎస్పీడీసీఎల్ నుంచి కరెంట్ బిల్లులు తెప్పించిన హౌసింగ్ అధికారులు
  • ఈసీఐఎల్ సమీపంలోని ఓ బ్లాక్​లో పైలెట్ ప్రాజెక్టు
  • సగం మంది లబ్ధిదారులు ఇండ్లలో ఉండట్లేదని బిల్లుల ద్వారా వెల్లడి
  • అనర్హులకు ఇండ్లు కేటాయించిన గత ప్రభుత్వం
  • కేంద్ర, రాష్ట్ర సర్కారు రూల్స్ ఉల్లంఘన 

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారుల్లో అనర్హులు ఎంత మంది ఉన్నారనే లెక్కలను హౌసింగ్ అధికారులు తీస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇళ్లలో తనిఖీలు చేశారు.  సర్వే చేస్తున్నట్లు ముందే ప్రకటించడంతో.. అధికారులు వస్తారని తెలిసి ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు డబుల్ ఇండ్లకు వచ్చి సర్వేలో పాల్గొని తిరిగి వెళ్లారు.

 దీంతో ఎంత మంది లబ్ధిదారులు ఇండ్లలో ఉంటున్నారన్నది తెలుసుకోవడం కష్టంగా మారింది. అందుకే అధికారులు కొత్త ప్లాన్ అనుసరించారు. ఆ ఇండ్లకు సంబంధించి గత 4 నెలలపాటు చెల్లించిన కరెంట్ బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ నుంచి తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈసీఐఎల్ సమీపంలోని రాంపల్లిలో ఉన్న 2,200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన కరెంట్ బిల్లులు పరిశీలించారు. 

చాలా ఇండ్లకు కనీసం 50 యూనిట్లు కూడా కరెంట్ కాలకపోవడంతో ఆ ఇండ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని తేలిపోయింది. ఇండ్లలో లబ్ధిదారులు నివసించి ఉంటే.. కనీసం 150 నుంచి 200 యూనిట్ల వరకైనా కరెంట్ కాలి ఉండేదని అంచనాకు వచ్చారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో కార్లు, ట్రాక్టర్లు ఉన్న 165 మందికి డబుల్ ఇండ్లు ఇచ్చినట్లు సర్వేలో తేలింది. 

దీంతో ఈ లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. చాలా మందికి ట్రాక్టర్లు, కార్లు ఉన్నా డబుల్ ఇండ్లు ఇచ్చారని, కేవలం మమ్మల్నే ఎందుకు గుర్తించారని వారు అధికారులను ప్రశ్నించటం గమనార్హం. అయితే, వాళ్ల వివరాలు కూడా ఇవ్వాలని అడిగితే చెప్పడానికి వారు నిరాకరించడంతో అవాక్కవటం అధికారుల వంతయింది.

కార్లు, ట్రాక్టర్లు ఉన్నోళ్లకు డబుల్ ఇండ్లు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో 100% సబ్సిడీతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్కీమ్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో లక్ష ఇండ్లు, జిల్లాల్లో లక్షా 72 వేల ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో లక్షా 98 వేల ఇండ్లు పూర్తి కాగా, ఇందులో లక్షా 48 వేల ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. 

ఇంకా 59 వేల ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. మరో 29 వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల రూల్స్ ప్రకారం ఫోర్ వీలర్ ఉంటే డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ హౌసింగ్ స్కీమ్ కు అయినా అనర్హులు అని అధికారులు చెబుతున్నారు. 

అయితే గత పదేళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన వాళ్లలో ట్రాక్టర్లు, కార్లు ఉన్న వాళ్లు వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కినట్లు గ్రేటర్ లో ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

త్వరలో జిల్లాల్లో సర్వే

గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ ఇండ్ల సర్వే పూర్తి కావటంతో త్వరలో జిల్లాల్లో సర్వే చేసేందుకు హౌసింగ్ అధికారులు రెడీ అవుతున్నారు. గ్రేటర్​లో సర్వే చేసిన సమయంలో సంగారెడ్డి నుంచి అధికారులను తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి సీజీజీ రూపొందించిన యాప్ తో ఈ సర్వే చేశారు. 

ఇపుడు జిల్లాల్లో ఇతర శాఖల అధికారులను ఈ సర్వేకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 59,400 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 22 వేల ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల కేటాయింపులో అప్లికేషన్లు పెట్టుకొని, సొంత జాగా లేని పేదలకు వీటిని  కేటాయించాలని ప్రభుత్వం నిర్ఱయించింది. 

అర్హులకు డబుల్ ఇండ్లు

రాష్ర్ట వ్యాప్తంగా అనర్హులకు దక్కిన డబుల్ ఇండ్లను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజా పాలన అప్లికేషన్లలో లక్షల మంది సొంత ఇళ్లు, జాగా లేని వాళ్లు ఉండటం, అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సరిపడా జాగాలు లేకపోవటంతో డబుల్ ఇళ్లను కేటాయించాలని చూస్తోంది. 

పారదర్శకంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను, డబుల్ ఇళ్లను కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతో పాటు ఖాళీగా ఉన్న, అనర్హులకు ఇచ్చిన డబుల్ ఇళ్లను స్వాధీనం చేసుకొని అర్హులకు ప్రభుత్వం అందచేయనుంది.