ఫేషియల్ రికగ్నిషన్ లో పొరపాటు.. దోపిడీ కేసులో ప్రెగ్నెంట్​ అరెస్టు

ఫేషియల్ రికగ్నిషన్ లో పొరపాటు.. దోపిడీ కేసులో ప్రెగ్నెంట్​ అరెస్టు

డెట్రాయిట్​: ఫేషియల్​ రికగ్నిషన్ టెక్నాలజీ అమెరికాలో కలకలం సృష్టిస్తున్నది. సామాన్య సిటిజన్స్ ఈ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమాయకులను సైతం పోలీసులు నేరస్థులుగా అనుమానిస్తూ అరెస్టు చేస్తున్నారు.  నేరస్థులను గుర్తించే  ఫేషియల్​ రికగ్నిషన్ లో​ పొరపాటు కారణంగా నిర్దోషి అయిన ఓ ప్రెగ్నెంట్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అమెరికాలోని డెట్రాయిట్​లో నిరుడు ఫిబ్రవరి 16న జరిగింది. ఎనిమిది నెలల గర్భిణి వుడ్రఫ్​ (32) ఇంట్లో ఉండగా కారు దొంగతనం, దోపిడీకి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులు అరెస్టు వారెంట్​అందజేశారు. 

తన ఇద్దరు కుమార్తెలను స్కూల్​కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతుండగా పోలీసులు అరెస్టు వారెంట్​ ఇవ్వడంతో జోక్ ​చేస్తున్నారని వుడ్రఫ్​ భావించింది. అయితే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు డెట్రాయిట్​ డిటెన్షన్​ సెంటర్​కు తరలించారు. సుమారు 11గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. ఆమె ఐఫోన్​ను స్వాధీనం చేసుకుని, లక్ష డాలర్ల పర్సనల్ ​బాండ్ ​తీసుకుని ఆమెను విడుదల చేశారు. 

నెల రోజుల తర్వాత కేసును కొట్టివేశారు. డెట్రాయిట్​ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేయడంతో ఆమె కోర్టులో కేసు ఫైల్​ చేసింది. ఫేషియల్ ​రికగ్నిషన్​లో జరిగిన పొరపాటు కారణంగా పోలీసులు తనను అరెస్టు చేశారని వుడ్రఫ్​ గుర్తించిందని ఎన్బీసీ న్యూస్​ నివేదించింది.