హైదరాబాద్- కరోనా కట్టడి కోసం ప్రజలల్లో అవగాహన తీసుకురావడం కోసం సికింద్రాబాద్ లో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన ప్రదర్శన నిర్వహించారు. కరోన వైరస్ రూపంలోని కిరిటాలను ధరించి గుర్రాలు, బైక్స్ పై వెళ్తూ కరోనా కట్టడికోసం చేయాల్సిన పనులను సూచిస్తూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుండి వైఎంసియే..ప్యాట్నీ మీదుగా ప్యారడైజ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ రంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మారేడ్ పల్లి, మహంకాళి టెంపుల్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఇన్స్ పెక్టర్లు..ఎస్సై.. సిబ్బంది పాల్గొన్నారు. పలు సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వచ్చిన వాహన దారులను ఆపి కరోన వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది, వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చి కరోన బారిన మీరు పడి కుటుంబ సభ్యులను, తోటి వారిని బలి చేయవద్దని ఏసీపీ రంగయ్య విజ్ఞప్తి చేశారు. కరోన కట్టడికోసం రాత్రిబవళ్ళు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న పోలీసులు వినూత్న ప్రయోగంతో ప్రజలలో మరింత అవగాహన తీసుకు రావడం కోసం చేసిన ప్రయత్నాన్ని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా బెట్టి, కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ సేవాలందిస్తున్నారు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు రోడ్లపైకి రావడం లేదు, మాస్కులు దరిస్తున్నారు, వ్యక్తిగత దూరం పాటిస్తున్నారు. అయినా కొంత మంది అవగాహన రాహిత్యంతో వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండటంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు పోలీసులు.
