నీట్ కౌన్సెలింగ్ స్థానికతపై.. సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ

నీట్ కౌన్సెలింగ్ స్థానికతపై.. సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ
  • తీర్పు సవరించాలంటే ముగ్గురు జడ్జీలుండాలన్న సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్​పై విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. నీట్​కు ముందు నాలుగేండ్లు లోకల్ గా చదవాలని, లేదా నివాసం ఉండాలని జీవో 33లోని నిబంధన 3 (ఏ) కింద చేర్చింది. అయితే, ఈ నిబంధనను సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన కె.నాగ నరసింహ అభిరామ్, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. స్టూడెంట్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు.. కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ 135 మంది కౌన్సెలింగ్​కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు సీజేఐతో కూడిన బెంచ్ మధ్యంతర స్టే ఇచ్చింది. 

అయితే, శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అడ్వొకేట్లు వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్​కు అవకాశం కల్పించడం సరికాదన్నారు. 

ఇతర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదించారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్టూడెంట్లందరికీ కౌన్సెలింగ్​కు అనుమతి ఇవ్వాలని కోరారు. స్పందించిన సీజేఐ చంద్రచూడ్.. గత తీర్పును సవరించాలంటే ఆ బెంచ్ లోని ముగ్గురు జడ్జీలు ఉండాలన్నారు. జస్టిస్ జేబీ పార్ధివాలా లేకపోవడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.