V6 News

మేడ్చల్ జిల్లాలోని అక్రమ రిజిస్ట్రేషన్ల పై విచారణకు ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలోని అక్రమ రిజిస్ట్రేషన్ల పై విచారణకు ఆదేశాలు
  • ‘వెలుగు’ కథనంతో కదిలిన అధికారులు

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లాలోని నారపల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. ‘77 గజాల ప్లాట్.. మారిన సర్వే నంబర్ రూట్’ శీర్షికతో శనివారం వెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జాయింట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ జనరల్ ఎం.మధుసూదన్ రెడ్డి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే విచారణ చేపట్టాలని ఆడిటింగ్ జిల్లా రిజిస్ట్రార్ ప్రకాశ్ కు సూచించారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ అశోక్, నారపల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ శ్రీదేవి పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. 

అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్వతాపూర్ సాయిప్రియ కాలనీ, సాలార్జంగ్ కంచ లేఅవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 16 ప్లాట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలిసింది. సర్వే నంబర్లలో మార్పులు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘వెలుగు’లో కథనం వెలువడిన తరువాత నారపల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ శ్రీదేవి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.