రియల్​ ఎస్టేట్​ రంగం జోరు మీదుంది

రియల్​ ఎస్టేట్​ రంగం జోరు మీదుంది
  • కాలియర్స్​ ఇండియా రిపోర్టు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో రియల్​ ఎస్టేట్​లో కంపెనీల పెట్టుబడులు రెండు రెట్లు పెరిగాయి. మార్చి 2022 చివరి నాటికి ఇన్​స్టిట్యూషనల్​ పెట్టుబడులు రూ. 8,375 కోట్లకు (1.1 బిలియన్​ డాలర్లు) చేరడం విశేషం. విదేశీ ఇన్వెస్టర్లు జోరు పెంచడమే దీనికి కారణం.కొవిడ్​ థర్డ్​ వేవ్​ తర్వాత ఎకానమీ పుంజుకుంటుండటంతో ఈ పెట్టుబడులు జోరందుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్​ కాలియర్స్​ ఇండియా ఒక రిపోర్టులో తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రియల్​ ఎస్టేట్​లో సంస్థాగత పెట్టుబడులు 0.5 బిలియన్​ డాలర్లని, ఇంతకు ముందు క్వార్టర్లో బిలియన్​ డాలర్లని కూడా పేర్కొంది. కొవిడ్–19 ఎఫెక్ట్​ తగ్గడంతో, ఎకానమీ జోరందుకుందని, ఇన్వెస్టర్ల సెంటిమెంట్​ కూడా బలపడిందని వివరించింది. దీంతో అంతకు ముందు క్వార్టర్​తో పోలిస్తే రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడులు బాగా ఊపందుకున్నాయని తెలిపింది.  

70 శాతం విదేశీ పెట్టుబడులే....
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఆఫీస్​ సెక్టార్లో భారీ డీల్స్​ జరిగాయని కాలియర్స్​ వెల్లడించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడులు మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయని పేర్కొంది. తాజా క్వార్టర్లో  మొత్తం పెట్టుబడులలో 70 శాతం విదేశీ ఇన్వెస్టర్లవేనని కాలియర్స్​ రిపోర్టు తెలిపింది. 2020లో భారీగా పడిపోయిన దేశీయ పెట్టుబడులు సైతం ఈ ఏడాది మళ్లీ 30 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. అంటే, కరోనా ముందు లెవెల్​కి చేరినట్లేనని వివరించింది. దేశీయ ఇన్వెస్టర్లలోనూ సెంటిమెంట్​ బలపడిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అభిప్రాయపడింది.

ఆఫీసు, రిటెయిల్​, లాజిస్టిక్సే ఎక్కువ​.....
జనవరి–మార్చి క్వార్టర్లో 95 శాతం పెట్టుబడులు రియల్​ ఎస్టేట్​లోని  ఆఫీసు, రిటెయిల్​, ఇండస్ట్రియల్​, లాజిస్టిక్స్​ సెగ్మెంట్లలోనే జరిగాయని కాలియర్స్​ ఇండియా వెల్లడించింది. 23 శాతం పెట్టుబడులతో రిటెయిల్​ సెక్టార్​ రెండో ప్లేస్​లో నిలిచిందని పేర్కొంది. ఈ సెగ్మెంట్లో ఒక పెద్ద డీల్​ జరిగినట్లు తెలిపింది. మొత్తం ఇన్వెస్ట్​మెంట్లో 16 శాతం ఇండస్ట్రియల్​, లాజిస్టిక్స్​ సెక్టార్లోకి వచ్చాయని, వాటి విలువ 0.2 బిలియన్​ డాలర్లని కాలియర్స్​ ఇండియా వివరించింది. 2022 క్యూ1లోనూ డేటా సెంటర్లలోనూ పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది.​ డేటా సెంటర్​సెగ్మెంట్లో 40 మిలియన్​ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని వివరించింది. గ్లోబల్​ డేటా సెంటర్​ రీట్స్​, డేటా సెంటర్​ మేనేజ్​మెంట్​ కంపెనీలు, హైపర్​ స్కేలర్లు కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడమే దీనికి కారణమని కాలియర్స్​ ఇండియా పేర్కొంది. 

రెసిడెన్షియల్​లో అంతంత మాత్రమే...
జనవరి–మార్చి 2022 మధ్య కాలంలో రెసిడెన్షియల్​ సెగ్మెంట్లో పెట్టుబడులు పెద్దగా పెరగలేదని కాలియర్స్​ ఇండియా రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో ఈ రంగంలో పెట్టుబడులు కేవలం 15 మిలియన్​ డాలర్లేనని తెలిపింది. మొత్తం పెట్టుబడులలో ఇది ఒక శాతం మాత్రమేనని వివరించింది. రాబోయే క్వార్టర్లలో రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడుల జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కాలియర్స్​ ఇండియా తెలిపింది. దేశీయ ఇన్వెస్టర్లు బుల్లిష్​గా ఉండటంతోపాటు, ఫండ్స్​ సమీకరిస్తుండటంతో ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది.