ఇన్సూరెన్స్‌ పాలసీల్లో  4 కోట్ల గోల్ మాల్

ఇన్సూరెన్స్‌ పాలసీల్లో  4 కోట్ల గోల్ మాల్

హైదరాబాద్‌, వెలుగు :  ఇన్సూరెన్స్  కంపెనీ పాలసీలను దొంగిలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పాలసీదారుల పేర్లతో, ఫేక్  మెయిల్‌ ఐడీలతో పాలసీ డబ్బును కొట్టేస్తున్న ఆరుగురిని రాచకొండ సైబర్‌‌  క్రైమ్  పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద  నుంచి రూ.6 లక్షల క్యాష్​, రూ.22 లక్షల విలువ చేసే 376 గ్రాముల బంగారం, మూడు కార్లు, ఎయిర్‌‌ గన్‌, పెల్లెట్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లోని రూ.3.49 లక్షలు ఫ్రీజ్  చేశారు. మొత్తం రూ.60 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్  చేశారు. సైబర్‌‌  క్రైమ్స్‌ డీసీపీ అనురాధ, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి సీపీ డీఎస్  చౌహాన్‌  సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్  జిల్లా బోధన్‌కు చెందిన  కొసరాజు రంగసాయి హర్ష (27) సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ ఇన్సూరెన్స్  కంపెనీలో  రిలేషన్ షిప్  మేనేజర్‌‌గా పనిచేస్తున్నాడు. పాలసీ హోల్డర్లు, కస్టమర్ల డేటాబేస్‌ ను హర్ష తన అధీనంలో ఉంచుకున్నాడు. మెచ్యూరిటీ ముగిసిన పాలసీలు, గడువు ముగిసినా క్లెయిమ్‌ చేసుకోని పాలసీ హోల్డర్లను గుర్తించాడు. దీంతో పాటు పాలసీదారులు మృతి చెందితే ఆయా కుటుంబాలకు చెందిన నామినీలు క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న పాలసీలు, యాక్టివ్‌గా లేని ఎన్‌ఆర్‌‌ఐల పాలసీల డేటాను కూడా సేకరించాడు. పాలసీ చేసిన తరువాత చాలా కాలంగా కంపెనీతో కాంటాక్టులు లేని పాలసీదారులను గుర్తించాడు. 

ఆన్‌లైన్  పాలసీ సరెండర్  సిస్టం, బ్యాంకింగ్  సిస్టంలోని లోపాలను గమనించాడు. అలాంటి పాలసీలను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశాడు. బోధన్‌లో తనకు తెలిసిన గ్రాఫిక్స్ డిజైనర్‌‌  దుప్పలపుడి అక్షయ్‌  కుమార్‌‌ అలియాస్  టోని (31) తో కలిసి హర్ష స్కెచ్‌  వేశాడు. ఫేక్  పాన్‌ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వాటితో బోధన్‌  మండలం రంజల్‌కు చెందిన మహ్మద్  యాసిన్‌ అహ్మద్‌ (27), బోధన్‌కు చెందిన మన్యం ప్రశాంత్‌ (23) లతో కలిసి సౌత్  ఇండియా బ్యాంక్‌, ఫెడరల్  బ్యాంక్‌, బంధన్ బ్యాంక్‌లలో ఖాతాలు తెరిపించారు. నగదు విత్‌డ్రా చేసేందుకు ఖమ్మంకు చెందిన ఉటుకూరి అచ్యుత్‌ (28), మేడ్చల్  జిల్లా అల్వాల్‌కు చెందిన అనుగుల ప్రకాష్‌  రెడ్డి(27) లతో హర్ష ఓ గ్యాంగును ఏర్పాటు చేశాడు. ఇన్సూరెన్స్‌ డేటాబేస్‌లో ఉన్న పాలసీ హోల్డర్ల పేర్లతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్  చేయించాడు. తర్వాత పాలసీదారుల పేరుతో నకిలీ మెయిల్ ఐడీ క్రియేట్‌  చేశాడు.

పాలసీ హోల్డర్ల డేటాబేస్‌తో మాస్టర్ ప్లాన్

ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆపరేషన్  టీం లాగిన్‌లను రంగసాయి హర్ష యాక్సెస్  చేశాడు. ఆఫీస్ ఉద్యోగుల పాస్‌వర్డ్ లను దొంగిలించాడు. వారి సిస్టమ్‌లో లాగిన్  అయి కస్టమర్ ప్రొఫైల్స్ ను అప్‌డేట్  చేశాడు. పాలసీ హోల్డర్ల మెయిల్  ఐడీ నుంచి క్లెయిమ్స్  కోసం రిక్వెస్ట్  పంపించాడు. ఇలా పాలసీ హోల్డర్ల నుంచి వచ్చే మెయిల్స్ ఆధారంగా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే కంపెనీ.. పాలసీ అమౌంట్‌ను ప్రాసెస్‌ చేసి  ట్రాన్స్‌ఫర్  చేసింది. ఇలా 2019 నుంచి హర్ష గ్యాంగ్‌  వరుస మోసాలకు పాల్పడింది. మొత్తం19పాలసీలను టార్గెట్‌ చేసింది. అందులో 14 పాలసీలను కొల్లగొట్టింది. ఇలా కంపెనీ పాలసీ హోల్డర్లకు చెందిన మొత్తం రూ.4 కోట్లు దొంగిలించారు.

మెయిల్‌ ఐడీలో అక్షరం మార్చి 56 లక్షలు కొట్టేశారు

మేడ్చల్  జిల్లా యాప్రాల్‌కు చెందిన ఎన్నారై  కిశోర్‌‌  సికింద్రాబాద్‌లోని ఇన్సూరెన్స్‌ కంపెనీలో పాలసీ చేశాడు. 2012 , 2014లో రూ.45 లక్షలు విలువ చేసే రెండు యునైటెడ్‌ లింక్డ్  ఇన్సూరెన్స్ పాలసీలు (యూలిప్‌) తీసుకున్నాడు. మెయిల్ ఐడీలో అక్షరం తప్పుతో కిశోర్‌‌కు బదులు కొశోర్‌‌  అని పేర్కొన్నాడు. దీంతో కిశోర్‌‌కు ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఎన్ని మెయిల్స్‌ వెళ్లినా ఆయనకు చేరలేదు. ఆయన కూడా ఈ విషయం గమనించలేదు. రిలేషన్‌షిప్‌  మేనేజర్‌‌గా పనిచేస్తున్న హర్ష.. దీనిని గుర్తించాడు. కిశోర్‌‌  పేరుతో నకిలీ మెయిల్‌  ఐడీ క్రియేట్‌ చేశాడు. తను పనిచేసే కంపెనీకే సరెండర్‌‌  మెయిల్స్  చేశాడు. ఇలా కిశోర్  పాలసీ నుంచి రూ.76 లక్షలను తమ ఫేక్   అకౌంట్స్‌లోకి బదిలీ చేసుకున్నాడు..

గోల్డ్‌  బిస్కెట్స్‌ కొని దొరికిపోయారు

పాలసీ నుంచి అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్   అయినట్లు గుర్తించిన కిశోర్‌‌  గత నెల21న రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సైబర్‌  ‌క్రైమ్  ఇన్‌స్పెక్టర్‌ ‌ నరేందర్‌‌  గౌడ్‌  ఆధ్వర్యంలోని టీం దర్యాప్తు చేసింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సౌత్‌  ఇండియా బ్యాంక్‌లోని యాసిన్‌  అహ్మద్‌ అకౌంట్‌లోకి నగదు బదిలీ జరిగినట్లు టీం గుర్తించింది. బ్యాంకు నుంచి మోహిదీపట్నంలోని జువెల్లరీ షాప్‌కు రూ.56 లక్షలు ఆన్‌లైన్  ట్రాన్సాక్షన్‌ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. నిందితులు రూ.56 లక్షలతో గోల్డ్‌ కాయిన్స్, బిస్కెట్స్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు, జువెల్లరీ షాప్‌లో  సీసీటీవీ  ఫుటేజీలు, ఫోన్ నంబర్ల ఆధారంగా  ఈనెల 2న యాసిన్‌ను అరెస్టు చేశారు.యాసిన్  ఇచ్చిన సమాచారంతో హర్ష, అక్షయ్‌  కుమార్‌‌, ప్రశాంత్‌, అచ్యుత్‌, ప్రకాష్‌ రెడ్డిలను ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇంకెవరైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.