పంచాయతీ కార్మికులకు.. రూ.5 లక్షలు ఇన్సూరెన్స్

పంచాయతీ కార్మికులకు..  రూ.5 లక్షలు ఇన్సూరెన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్సస్ వర్కర్లకు ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రీమియంను పంచాయతీల నిధుల నుంచి చెల్లించాలని సూచించింది. పంచాయతీ కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు గతంలో రూ.5 వేలు ఇస్తుండగా.. తాజాగా దాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండు అంశాలపై పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం జిల్లా కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు, డీపీవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. 

తమను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయటంతో పాటు మరో 15 డిమాండ్లను పరిష్కారించాలని 32 రోజుల పాటు 43 వేల మంది పంచాయతీ కార్మికులు సమ్మె చేశారు. ఈ డిమాండ్లలో ఆర్థిక భారం ఉన్న వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, మిగతా డిమాండ్లను తాము పరిష్కరి స్తామని మంత్రులు హరీశ్‌‌, దయాకర్ రావు హామీ ఇచ్చారు. దీంతో ఇటీవల సమ్మెను విరమించారు. మంత్రులు అంగీకరించిన డిమాండ్లలో ఈ రెండింటిని ప్రభుత్వం అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

మిగతా డిమాండ్లనూ పరిష్కరించాలి: జేఏసీ

ఫ్యునరల్ చార్జీలను పెంచడం, మల్టీ పర్పస్ వర్కర్లకు ఇన్సూరెన్స్ ఇవ్వటంపై పంచాయతీ వర్కర్లు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. మల్టీ పర్పస్ విధానం రద్దు, కార్మికులను రెగ్యులర్ చేయటం, కనీస వేతనాలు చెల్లించటం, కారోబార్లు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ వంటి డిమాండ్లను నెరవేర్చాలని ఓ ప్రకటనలో కోరారు. ఇందుకు జేఏసీని చర్చలకు పిలవాలని, మిగతా డిమాండ్లను పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు.