హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈనెల 8 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాషా అభినవ్ వివరాలు వెల్లడించారు. సర్కారీ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ సహా అన్ని జూనియర్ కాలేజీలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి మే 31 వరకు విద్యార్థులు కాలేజీల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభంకానున్నాయి. అడ్మిషన్ల మొదటి విడత ప్రక్రియ జూన్30 నాటికి పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులు ప్రస్తుతానికి ఇంటర్నెట్ మార్కుల మెమోల ద్వారా ప్రొవిజనల్ అడ్మిషన్ తీసుకోవచ్చని, ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీలు సమర్పించి సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించింది.
పారదర్శకత కోసం కాలేజీ మేనేజ్మెంట్లు ప్రతిరోజూ తమ దగ్గర ఉన్న ఖాళీ సీట్లు, భర్తీ అయిన సీట్ల వివరాలను గేటు వద్ద బోర్డుపై ప్రదర్శించాలని పేర్కొంది. విద్యార్థులను ఆకర్షించేందుకు తప్పుడు ప్రకటనలు, గిఫ్టులు ఆశ చూపే కాలేజీలపై నిఘా ఉంచుతామని బోర్డు హెచ్చరించింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29% సీట్లు కేటాయించాలని, బాలికలకు 33.33% రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది.
ఎంట్రెన్స్ టెస్టులు పెడితే చర్యలు..
అడ్మిషన్ల ప్రక్రియలో కాలేజీలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించొద్దని ఇంటర్ బోర్డు ప్రకటించింది. కేవలం టెన్త్‌లో వచ్చిన జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయించాలని, నిబంధనలు అతిక్రమించినా, టెస్టులు పెట్టినా సదరు కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. అడ్మిషన్ సమయంలో విద్యార్థి ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి చేసింది. ప్రైవేట్ కాలేజీలు ప్రతి సెక్షన్‌కు గరిష్టంగా 88 మందినే చేర్చుకోవాలని, అంతకంటే ఎక్కువ మందిని చేర్చుకుంటే జరిమానా తప్పదని చెప్పింది.
పేరెంట్స్ హామీ ఇవ్వాల్సిందే..
ఈసారి ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం విద్యార్థులతోపాటు వారి పేరెంట్స్ నుంచి కూడా యాంటీ డ్రగ్ అఫిడవిట్ తీసుకోవాలని ప్రిన్సిపాల్స్ ను అధికారులు ఆదేశించారు. తమ పిల్లలు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటారని, ఒకవేళ వాడితే కాలేజీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని తల్లిదండ్రులు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు జోగినిల పిల్లల అడ్మిషన్లలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.
