అతనో మాజీ సైనికోద్యోగి. 21 ఏళ్లు ఆర్మీలో పనిచేసారు. మరో 21 ఏళ్లు వివిధ కంపెనీల్లో ఉద్యోగిగా సేవలందించారు. ఇప్పుడు ఆయన వయసు డెబ్భైనాలుగు సంవత్సరాలు.. ఈ వయసులో ఇంటర్ పాసై శభాష్ నాగ్ అనిపించుకున్నారు.
74 ఏళ్ల వయస్సులో విశ్రాంత ఉద్యోగులు కృష్ణ,రామ అనుకుంటూ.. టీవీ ముందు కూర్చుని పాత పాటలు చూస్తూ కాలం గడుపుతారు, లేదా ఉన్న రోగాలకు వైద్యం చేయించుకుంటూ బిజీఅవుతారు.కాస్త కులాసాగా ఉంటే నలుగుర్నేసుకుని రాజకీయాలు రంగరిస్తారు. ఇవేవీ చేతకాకపోతే కన్నబిడ్డలకు సలహాలిస్తూ గంటకు గంపెడు తిట్లు తిట్టించుకుంటారు. ఇదీ కష్టం అనుకుంటే గొడవలేని పని..! రోజుకు పది సార్లు న్యూస్ పేపర్ చదువుతారు. కానీ ఎప్పుడో ఆగిపోయిన చదువుని మళ్లీ కొనసాగించాలనుకుంటారా..! కాని అవిశ్రాంత ఉద్యోగి కల్లా నాగ్‌శెట్టి అనుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఇంటర్ పాసై శభాష్ నాగ్ అనిపించుకున్నారు.
గతంలో పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కట్టింది. తొలి ప్రయత్నంలోనే ఇంటర్ పూర్తిచేశాడు. ఆయన ఆశయం, లక్ష్యం చూసి ఆశ్యర్యపోయిన అధికారులు రెడ్‌కార్పెట్ వేశారు. డిగ్రీ చదవటానికి పచ్చజెండా ఊపారు. ఆయనే కల్లా నాగ్‌శెట్టి. వయస్సు 74 ఏండ్లు. నేటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎవరీ నాగ్‌శెట్టి..
కల్లా నాగ్‌శెట్టి హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్ నివాసి. బీదర్ జిల్లాలో 1949లో జన్మించిన ఆయన ఎస్‌ఎస్‌ఎల్‌సీ(మెట్రిక్యులేషన్) వరకు అక్కడే చదివారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సాధ్యంకాలేదు. ఆ క్రమంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరై సిపాయిగా ఉద్యోగంలో చేరాడు. 21 ఏండ్లు పనిచేసి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా (జేసీవో) పదవీ విరమణ పొందాడు. 1971 ఇండో పాక్ యుద్ధం, 1984 ఆపరేషన్ బ్లూస్టార్‌లలో పాల్గొన్నాడు. శ్రీలంకకు పంపించిన శాంతిసేన సభ్యుడిగాను సేవలందించి పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత మరో 21 ఏండ్లు ప్రైవేట్ కంపెనీల్లో పలు ఉద్యోగాలు చేశాడు.
చిరుప్రయత్నమే చిగురించి
చిన్నప్పుడు ఆపేసిన చదువును మళ్లీ కొనసాగించేందుకు ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొన్నారు. చివరకు సైదాబాద్‌లోని గోకుల్ జూనియర్ కాలేజీలో సీఈసీలో అడ్మిషన్ పొందాడు. 2023 మార్చిలో వార్షిక పరీక్షలు రాసి ఏకంగా 77.04 పర్సంటేజీతో ఇంటర్ పూర్తిచేశాడు.తాను చదువుకునే అవకాశం కల్పించిన విద్యాశాఖాధికారులకు నాగ్‌శెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

