అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్ట్ .. రైలులో తరలిస్తున్న 4 కిలోల గంజాయి స్వాధీనం

అంతర్ రాష్ట్ర  గంజాయి స్మగ్లర్ అరెస్ట్ .. రైలులో తరలిస్తున్న 4 కిలోల గంజాయి స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: రైలులో గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర  స్మగ్లర్ ను సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్, జీఆర్పీ ఇన్​స్పెక్టర్​సాయి ఈశ్వర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

లాలాపేట శాంతినగర్ కు చెందిన  షేక్ వహీద్ స్థానికంగా బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో గంజాయి విక్రయించడం మొదలుపెట్టాడు. గతంలో లాలాపేట, తుకారాంగేట్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. విడుదలయ్యాక మళ్లీ గంజాయి అమ్మడం ప్రారంభించాడు.

 నాగ్ పూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. గత నెల 30న నాగ్ పూర్​వెళ్లి ఓ వ్యక్తి వద్ద 4.104 కిలోల గంజాయి కొన్నాడు. అదే రోజు రాత్రి రైలెక్కి సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  దిగాడు. 

ప్లాట్ ఫాం–1 నుంచి బయటకు వెళ్తూ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే అతన్ని ఆపి, బ్యాగ్ ను తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. గంజాయి కొనుగోలు చేసి, కొంత అవసరానికి వాడుకొని, మిగతాది ఇతరులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని, వహీద్​ను అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ జావేద్ పేర్కొన్నారు.