కాలేజీకి వెళ్లాలని మందలించిన తండ్రి.. మంజీరా నదిలో దూకిన కొడుకు

కాలేజీకి వెళ్లాలని మందలించిన తండ్రి.. మంజీరా నదిలో దూకిన కొడుకు

జోగిపేట, వెలుగు : కాలేజీకి వెళ్లాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్‌‌ స్టూడెంట్‌‌ మంజీరా నదిలో దూకాడు. ఈ ఘటన సంగారెడ్డి ఆందోల్‌‌ మండలంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల పరిధిలోని రోళ్లపాడ్‌‌ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు ఏడాది కింద బతుకుదెరువు కోసం ఇస్నాపూర్‌‌కు వెళ్లాడు. అతడి కొడుకు పెద్దగొల్ల జగన్‌‌ (16) చిన్న చిట్కుల్‌‌ పరిధిలోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతున్నాడు. 

అయితే జగన్‌‌ కాలేజీకి సరిగా రావడం లేదంటూ రాములుకు నిర్వాహకులు ఫోన్‌‌ చేశారు. ఈ విషయంలో రాములు కొడుకు జగన్‌‌ను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన జగన్‌‌ గురువారం ఉదయం స్పెషల్‌‌ క్లాస్‌‌ ఉందని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. 

చింతకుంట ప్రాంతంలోని బ్రిడ్జి వద్ద బస్సు దిగిన జగన్‌‌.. సాయంత్రం బ్రిడ్జి పైనుంచి మంజీరా నదిలో దూకాడు. నదిలీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జగన్‌‌ ఆచూకీ దొరకలేదు. తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.