ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు .. అదే నెల 3 నుంచి ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు .. అదే నెల 3 నుంచి ప్రాక్టికల్స్
  • నవంబర్1 నుంచి ఫీజు స్వీకరణ 
  • వచ్చే ఏడాది నుంచి పరీక్షల్లో భారీగా సంస్కరణలు 
  • వివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. మార్చి 18 వరకూ పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు.  ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్‌‌‌‌ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఎగ్జామ్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ షురూ అవుతుందని పేర్కొన్నారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు.  శనివారం  హైదరాబాద్​ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయితో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్‌‌‌‌‌‌‌‌లోని అన్ని సబ్జెక్టుల సిలబస్‌‌‌‌లో మార్పులు చేస్తున్నట్టు  చెప్పారు. 

మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులను 2013–14లో మార్చినట్టు వెల్లడించారు. 2019లో హ్యుమానిటీస్, 2021లో ఫస్ట్ లాంగ్వేజీ , 2018లో సెకండ్ లాంగ్వేజీ, 2020లో తెలుగు సబ్జెక్టు   సిలబస్‌‌‌‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. 

ఎన్​సీఈఆర్టీ  నిబంధనలకు తగ్గట్టుగా మళ్లీ వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని సబ్జెక్టుల సిలబస్‌‌‌‌లో​ మార్పులు చేస్తున్నామని వివరించారు. సబ్జెక్ట్ ఎక్స్‌‌‌‌పర్ట్​ల ద్వారా 40 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. 

ఏప్రిల్‌‌‌‌ నెలాఖరులోగా పుస్తకాలు సిద్ధం

వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా మార్కెట్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు  కృష్ణ ఆదిత్య తెలిపారు. పుస్తకాల్లో క్యూఆర్ కోడ్, డిజిటల్ కంటెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్  మార్కుల విధానం అమలు చేస్తున్నామని వివరించారు.  ప్రతి సబ్జెక్టులో 80 శాతం థియరీ, 20 శాతం మార్కులు ఉంటాయన్నారు. అకౌంటెన్సీలో కొత్త కోర్సును తీసుకొస్తున్నామని, ఎంఈసీ గ్రూపు విద్యార్థులకు ప్రత్యేకంగా పేపర్ తయారు చేస్తామని వెల్లడించారు.  

వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్‌‌‌‌‌‌‌‌లోనూ ప్రాక్టికల్‌‌‌‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.  సీసీ కెమెరాలు ఉన్న ప్రైవేట్‌‌‌‌ కాలేజీలకు మాత్రమే ప్రాక్టికల్స్‌‌‌‌సెంటర్లకు అవకాశం ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఆక్సుపెన్సీ సమస్యతో ఇంకా 14 ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదని చెప్పారు. వాటిలో 3 వేల మంది విద్యార్థులున్నారని, వారం పదిరోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.