జూన్ 24 నుంచి ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌‌పో

జూన్ 24 నుంచి ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌‌పో

హైదరాబాద్, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రతిష్టాత్మక 11వ ‘ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌‌పో–2026’ నిర్వహించనున్నారు. నెక్స్​జెన్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో జూన్ 24, 25 తేదీల్లో జరిగే ఈ ఈవెంట్‌‌లో ఏఐ బేస్డ్‌‌ పోలీసింగ్, సైబర్ దర్యాప్తు సాధనాలు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు వంటి అత్యాధునిక టెక్నాలజీలను ప్రదర్శించనున్నారు. 

సాంకేతిక హబ్‌‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌‌కు ఇవి ఎంతో కీలకమని, డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయని నిర్వాహక సంస్థ డైరెక్టర్ సంగీత బన్సల్ వెల్లడించారు. ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో 200కు పైగా దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు పాల్గొని పోలీసింగ్‌‌కు అవసరమైన స్మార్ట్ సొల్యూషన్లను ఆవిష్కరించనున్నాయి. 

ఇక్కడే ‘ఇండియా హోమ్‌‌ల్యాండ్ సెక్యూరిటీ ఎక్స్‌‌పో’, ‘డ్రోన్ ఇంటర్నేషనల్ ఎక్స్‌‌పో’లను కూడా నిర్వహించనున్నారు. ఈ వేదికగా జరిగే ‘ఇంటర్నేషనల్ పోలీస్ టెక్నాలజీ కాన్ఫరెన్స్’లో ఇతర దేశాల పోలీసు ఉన్నతాధికారులు, సైబర్ నిపుణులు కూడా పాల్గొని డిజిటల్ పోలీసింగ్, పబ్లిక్ సేఫ్టీపై లోతుగా చర్చించనున్నారు.