హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ గైనకాలజిక్ ఆంకాలజీ విభాగంలో అందుబాటులోకి వైద్య విధానాలపై శని, ఆదివారాల్లో అంతర్జాతీయ రోబోటిక్ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్ నిర్వహించారు. రోబోటిక్ శిక్షణ, లైవ్ సర్జరీ, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌కు రోబోటిక్ సర్జరీలు ఎలా చేయాలనే విధానాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో 30 శాతం గైనిక్ క్యాన్సర్లే ఉంటున్నాయన్నారు. రోబోటిక్ సర్జరీ రంగంలో తమ సర్జన్ల నైపుణ్యాన్ని పంచుకోవడం, ప్రదర్శించడం వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశమన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ వాల్టర్ హెచ్ గాట్లీబ్, తమ బృందంతో చర్చించడానికి, ఆపరేట్ చేయడానికి ఇక్కడకు వచ్చారన్నారు. యశోద హైటెక్ సిటీ క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీ గత దశాబ్ద కాలంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందన్నారు. దేశంలోని 70 హాస్పిటళ్లలో మాత్రమే రోబోటిక్ సర్జరీల ప్రాక్టీస్ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో దేశం నలుమూలల నుంచి గైనకాలజిస్ట్‌లు, సర్జన్లు పాల్గొన్నారు.

