రేపు(ఆగస్టు30) NEET పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, విద్యార్థులకు కీలక సూచనలు

రేపు(ఆగస్టు30) NEET పీజీ పరీక్ష.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, విద్యార్థులకు కీలక సూచనలు

దేశవ్యాప్తంగా  మెడికల్ పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2026 నిర్వహణకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్​లో  నాలుగు సెంటర్లలో నీట్​పీజీ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పరీక్షా కేంద్రాలున్న  ప్రాంతాల్లో ట్రాఫిక్​రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్​పోలీసులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 

రేపు(ఆగస్టు 30న) హైదరాబాద్ సిటీలోని నాలుగు కేంద్రాల్లో NEET- పీజీ పరీక్ష నిర్వహించనున్నారు. బండ్లగూడ, సికింద్రాబాద్ ప్యారడైజ్, కింగ్ కోఠి–అబిడ్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్​ రద్దీ ఉండొచ్చని చెబుతున్నారు. ప్యారడైజ్, కింగ్ కోఠి, తాజ్‌మహల్ జంక్షన్, బండ్లగూడ, రేతిబౌలి, నానల్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందని విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్​ సెంటర్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు.ముఖ్యంగా షేక్‌పేట్‌లోని జీ. నారాయణమ్మ కాలేజీ పరీక్షా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అదే రోజు మారథాన్‌ ఉండటంతో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బోరబండ, కళ్యాణ్‌నగర్, మధురానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చే విద్యార్థులు జూబ్లీహిల్స్–ఫిల్మ్‌నగర్ మార్గంలో వెళ్లాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి–సైబరాబాద్ వైపు నుంచి వచ్చే వారు రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్, పక్షి సర్కిల్, న్యాయ విహార్, ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్లాలి.

బంజారాహిల్స్ రోడ్ నంబర్లు 14, 10, 12 నుంచి వచ్చే వారు అగ్రసేన్ ఐలాండ్–భారతీయ విద్యాభవన్ వన్‌వే మార్గం ద్వారా ఫిల్మ్‌నగర్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే బయలుదేరాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. అత్యవసర ప్రయాణ సాయం కోసం 9010203626 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.