మహిళలపై దాడులను అరికట్టాలి

మహిళలపై దాడులను అరికట్టాలి

ప్రతి ఏటా మార్చి 8న మనం ఇచ్చే  ప్రసంగాలు ఒక అలంకారప్రాయమైన ముసుగు మాత్రమే.  2023లో మహిళలపై నమోదైన నేరాలు 4,48,211. అంటే రోజుకు వెయ్యికి పైగా కేసులు. ఏడాదికి  సుమారు 8,000 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి 6,156 కట్న హత్యలు  జరుగుతున్నాయంటే, వివాహం ఒక పితృస్వామ్య  ఆర్థిక  ఒప్పందంగా మారిందని అర్థం. ఈనేపథ్యంలో మహిళలపై జరుగుతున్న దాడులను,  నేరాలు అరికట్టాలి.

దుస్తులు, ప్రేమ, వివాహం వంటి వ్యక్తిగత అంశాలను మత కట్టుబాట్ల పేరుతో నిర్దేశించి, స్త్రీ వ్యక్తిత్వాన్ని మత ప్రతిష్టకు చిహ్నంగా మార్చడం. మత ఆధిపత్య పోరాటాల్లో స్త్రీ  సమిధగా మారుతోంది; ప్రత్యర్థి మతాన్ని అవమానించడానికి మహిళలపై దాడులు రాజకీయ ఆయుధంగా మారుతున్నాయి. 

సంప్రదాయాల ముసుగులో అసమానతలను ‘దైవ నిర్ణయం’గా చూపించి, హక్కుల కోసం చేసే పోరాటాన్ని మతద్రోహంగా చిత్రీకరిస్తున్నారు. నేడు సమాజంలో అత్యంత విషపూరితమైన పోకడ  ‘కమిట్‌‌మెంట్’ సంస్కృతి. ఆయా రంగాల్లో పదోన్నతి లేదా బదిలీలు, పోస్టింగ్‌‌లు, కాంట్రాక్టుల కోసం మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం ఒక వ్యవస్థీకృత దోపిడీగా మారింది. 

మహిళలను గౌరవించాలి
స్త్రీపై జరిగే లైంగిక హింస విషయంలో న్యాయ వ్యవస్థ కూడా చాలా సార్లు టెక్నికల్ నిర్వచనాలకే ప్రాధాన్యం ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల చత్తీస్‌‌గఢ్ హైకోర్టు 2004 ఘటనకు సంబంధించిన కేసులో పూర్తి చొరబాటు నిరూపితం కాలేదని పేర్కొంటూ అత్యాచారం నేరాన్ని‘అత్యాచార ప్రయత్నం’గా పరిగణించి శిక్షను తగ్గించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 

చట్టపరంగా అప్పటి నిబంధనల ప్రకారం తీర్పు ఇచ్చినప్పటికీ, లైంగిక హింసను  కేవలం వైద్య ఆధారాలు లేదా టెక్నికల్ నిర్వచనాలకే పరిమితం చేయడాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

ఈ ఘటన స్త్రీ గౌరవం, శరీర స్వేచ్ఛ వంటి అంశాలను న్యాయ వ్యవస్థ ఎంత సున్నితంగా పరిగణిస్తున్నదనే ప్రశ్నను ముందుకు తెస్తోంది. సైబర్ హింస మహిళలను మరింత బలహీనపరుస్తోంది. మార్ఫింగ్ ఫోటోలు, డీప్‌‌ఫేక్ టెక్నాలజీ ద్వారా మహిళల వ్యక్తిత్వ హననం ఒక నిత్యకృత్యమైంది. మహిళా బతుకే ప్రమాదంలో ఉన్న సమాజంలో మౌనం వహించడం  సరికాదు.  ఈ వ్యవస్థను మార్చడమే మనం మహిళలకు ఇచ్చే గౌరవం.

పి.రేణుక భూంపల్లి

ఓపెన్ ​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.