- హాజరుకానున్న గవర్నర్, కెప్టెన్ మీరా దేవ్, నటి గౌతమి
- 1,200 మంది ప్రతినిధుల రాక
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభం కానుంది. మహిళా సాధికారత, నాయకత్వం, పురోభివృద్ధి ఇతివృత్తంగా నిర్వహించనున్న ఈ భారీ సదస్సు.. వర్సిటీ 108 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈనెల 24 నుంచి 26 వరకు ప్రతిష్టాత్మకమైన ఠాగూర్ ఆడిటోరియం ఈ అరుదైన వేడుకలకు వేదిక కానుంది. తెలంగాణ రైజింగ్ 2047, జాతీయ దార్శనికతకు అనుగుణంగా మహిళా సాధికారత ద్వారా ప్రపంచ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని ఓయూ వీసీ కుమార్ మొలుగరం తెలిపారు.
‘గివ్ టు గెయిన్, మహిళా శక్తి - సుస్థిరత’ అనే థీమ్‌తో సాగే ఈ చర్చలు విద్యార్థులను కేవలం అభ్యాసకులుగానే కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే నాయకులుగా తీర్చిదిద్దుతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గౌరవ అతిథులుగా మాజీ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ మీరా దేవ్, టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి అటెండ్ కానున్నారు. సదస్సులో ప్రధాన వక్తలుగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రఘురాం, జస్టిస్ సురేపల్లి నంద, ప్రముఖ నటి గౌతమి తడిమల్ల ప్రసంగించనున్నారు.
ఈనెల 26న జరిగే ముగింపు వేడుకల్లో ఐఏఎస్ అధికారిణి శ్రీదేవసేన, ఎన్ హెచ్ఆర్సీ చైర్ పర్సన్ విజయభారతి సయాని, ఏలెప్ చైర్ పర్సన్ రమాదేవి కన్నెగంటి పాల్గొంటారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500 మంది అధ్యాపకులు, 700 మంది విద్యార్థులు కలిపి మొత్తం 1,200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ వంటి విభాగాల్లో సుమారు 250 పరిశోధనా పత్రాలను ఇక్కడ సమర్పించనున్నారు.
