అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ.17.85 లక్షల సొత్తు స్వాధీనం

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ.17.85  లక్షల సొత్తు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర  దొంగని అల్వాల్ పోలీసులు అరెస్ట్​ చేశారు.  అతని నుంచి రూ.17.85 లక్షల విలువైన  బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.  బుధవారం  మేడ్చల్​డీసీపీ శబరీశ్​ తెలిపిన వివరాల ప్రకారం..   కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకి  చెందిన గులాబ్​ గంగారాం చవాన్​ (34) అల్వాల్​, మచ్చ బొల్లారంలో ఉంటూ  లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు.  జల్సాలకు, ఈజీమనీకి అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు.  కర్ణాటకలో అనేక దొంగతనాల్లో ఇతడు నిందితుడు.  బొల్లారం, అల్వాల్​ పోలీస్​ స్టేషన్‌‌‌‌‌‌‌‌ల పరిధిలో  నిర్మానుష్యంగా ఉన్న  ప్రదేశాల్లో ఇండ్లను ఎంచుకుని  రెండు నెలల్లో 8 దొంగతనాలు చేశాడు.  బుధవారం అల్వాల్​ పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా దొంగతనాల గురించి ఒప్పుకున్నాడు.  ఇతడిపై గతంలో 17 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 27 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.1.30 లక్షల నగదు, మొత్తం రూ.17.85 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

బైక్‌‌‌‌‌‌‌‌ దొంగలు ఇద్దరు దొరికిన్రు

గండిపేట: మైలార్ దేవ్ పల్లి పరిధి శాస్త్రిపురంలో ఉండే అఖిల్ ఖాన్(24), షోయబ్ అలీ, కింగ్స్ కాలనీకి చెందిన ముజామిల్(19) ఈ ముగ్గురు కలిసి కొంతకాలంగా ఇండ్ల ముందు, రోడ్ల పక్కన పార్కింగ్ లో ఉన్న బైక్ ల ను ఎత్తుకెళ్తున్నారు. బుధవారం ఉదయం అఖిల్, ముజామిల్ ను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.