- ఒకటి రెండు రోజుల్లో రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దు, ఇతర అంశాలపై కేంద్రం చేపట్టిన విచారణ ముగిసింది. హైదరాబాద్లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు రోజుల పాటు ఎంక్వైరీ చేసిన కేంద్ర బృందం శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. కమిటీ సభ్యులు ఒకటి, రెండు రోజుల్లో కేంద్రానికి నివేదిక అందించనున్నారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీ నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రెడ్ హిల్స్ ఏరియాలోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకొని విచారణ స్టార్ట్ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం, సీఎస్ఆర్ ఫండ్స్ ఖర్చులపై చాలా లోతుగా విచారణ జరిపారు.
సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్ తో పాటు సంస్థ డైరెక్టర్లు టెక్నికల్ కమిటీ సభ్యులు కోరిన అఫిషియల్ ఫైల్స్ అన్నీ అందించారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. దీంతో ఇక్కడ సేకరించిన ఫైల్స్ జిరాక్స్ పేజీలను కమిటీ సభ్యులు తమ వెంట తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు జరిపిన ఎంక్వైరీపై రిపోర్ట్ రెడీ చేసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆఫీసులో త్వరలో అందించనున్నారు.
