రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా 20 కోట్ల మోసం!.. అధిక వడ్డీ ఇస్తామని..

రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా 20 కోట్ల మోసం!.. అధిక వడ్డీ ఇస్తామని..
  • ఐపీ పెట్టిన కంపెనీ
  • న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

మల్కాజిగిరి, వెలుగు: పెట్టుబడి పేరిట రిటైర్డ్ ఉద్యోగులు, చిరువ్యాపారులను మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోకి తాజాగా వెలుగులోకి వచ్చింది. శనివారం విలేకరుల సమావేశంలో బాధితులు జగన్నాథరావు, రవి, శ్రీధర్, సతీశ్, సుధాకర్, ఫణిసూర్యనారాయణ తదితరులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి వివరాల ప్రకారం.. మల్కాజిగిరిలోని సైనిక్‌పూరిలో తొలుత పాన్యం దినేశ్, అతని భార్య కవిత సెల్ఫ్ బౌండ్ కోవర్కింగ్ పేరిట ఆఫీస్​ఏర్పాటు చేశారు. 

రిటైర్డ్ ఉద్యోగులు, చిరువ్యాపారులను టార్గెట్​చేసుకొని బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామన్నారు. ప్రారంభంలో చెక్కులు ఇచ్చి, కొన్ని నెలలు వడ్డీ చెల్లించిన దినేశ్.. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేశాడు. మే నెలలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) వేసి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 165 మంది నుంచి దాదాపు రూ.20 కోట్ల వరకు వసూల్ చేసినట్లు చెప్పారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా సివిల్ మ్యాటర్​గా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు.