
దుబాయ్: ఇండియా తనకు సెకండ్ హోమ్‌గా మారిందని ఆస్ట్రేలియా ప్లేయర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ తనకు కుటుంబంగా మారిపోయిందని ఈ డాషింగ్ లెఫ్టాండర్ చెప్పాడు. ట్రోఫీ నెగ్గడమే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు తాము ఇచ్చే అత్యుత్తమ బహుమతి అని పేర్కొన్నాడు. ‘హైదరాబాద్ ఫ్యాన్స్‌కు నేను మాటిస్తున్నా. కప్ గెలిస్తే బుట్టబొమ్మ పాటకు నేను డ్యాన్స్ చేస్తా. ఎస్‌ఆర్‌హెచ్ నా ఫ్యామిలీ లాంటిది. ఇండియాను నా రెండో ఇల్లుగా చెప్పొచ్చు. ఈ ఫ్రాంచైజీకి ఆడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మమ్మల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడం మా బాధ్యత. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినందున వారిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. ట్రోఫీ గెలవడానికి శాయశక్తులా కృషి చేస్తాం’ అని వార్నర్ చెప్పాడు. లాక్‌డౌన్ టైమ్‌లో తన భార్యతో కలసి తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ ఫ్యాన్స్‌ను వార్నర్ ఖుషీ చేశాడు.