ఇవాళ ఢిల్లీతో సన్ రైజర్స్ అమీతుమీ

ఇవాళ ఢిల్లీతో సన్ రైజర్స్ అమీతుమీ

సన్ రైజర్స్ హైదరాబాద్ కు చావోరేవో
ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే.. తప్పక గెలవాల్సిందే

దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారం ఇక్కడ జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. పంజాబ్ చేతిలో శనివారం ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తమకు మిగిలిన మూడు మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. నేడు జరిగే మ్యాచ్లో ఓడితే సన్ రైజర్స్ ఆఫ్ రేసు నుంచి అధికారికంగా ఔటైనట్టే. హైదరాబాద్కు ఈ మ్యాచ్ కీలకమైనా…. ఢిల్లీని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. లాస్ట్ రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు ఓడినా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి పోటీ తప్పదు.
ఃఅన్నింటికంటే ముఖ్యంగా పంజాబ్ ఇచ్చిన షాక్ నుంచి ఆరెంజ్ ఆర్మీ బయటపడుతుందో లేదో చూడాలి. కెప్టెన్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్తో కూడిన టాపార్డర్ రాణిస్తున్నా.. మిడిలార్డర్ వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని దెబ్బతీస్తోంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. జేసన్ హోల్డర్ చేరికతో బౌలింగ్ బలం పెరగడం, చివరిసారి ఆడినప్పుడు ఢిల్లీపై గెలవడం హైదరాబాద్ జట్టుకు సానుకూల అంశాలు.


మరోపక్క వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫమ్ చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్ శిఖర్ ధవన్ సూపర్ ఫామ్ లో ఉండగా మిగిలిన బ్యాట్స్మెన్ కూడా టచ్లో ఉన్నారు. రబాడ, నోకియా, తుషార్ దేశ్పాండే, అశ్విన్, అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బౌలింగ్ లో కూడా అదరగొడుతోంది. మరి ఢిల్లీకి రెండోసారి కళ్లెం వేసి ప్లేఆఫ్ రేస్లో సన్ రైజర్స్ ముందడుగు వేస్తుందో లేదో అనేది ఆసక్తికరం.