ప్లేఆఫ్ రేసులో నువ్వా నేనా అంటున్న ముంబై, బెంగళూరు

ప్లేఆఫ్ రేసులో నువ్వా నేనా అంటున్న ముంబై, బెంగళూరు

ప్లే ఆఫ్స్‌ బెర్తే టార్గెట్‌గా నేడు బెంగళూరు, ముంబై అమీతుమీ

అబుదాబి: కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ఫిట్‌‌నెస్‌‌పై ఆందోళన నెలకొనగా.. డిఫెండింగ్‌‌  చాంప్‌‌ ముంబై ఇండియన్స్‌‌  కీలక సవాల్‌‌కు రెడీ అయింది. బుధవారం జరిగే మ్యాచ్‌‌లో పటిష్ట  రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుతో పోటీ పడనుంది.  పదకొండు మ్యాచ్‌‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 3వ స్థానాల్లో  ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్‌‌ బెర్త్​ అఫీషియల్‌‌గా ఖరారు చేసుకోవాలని చూస్తున్నాయి. అలాగే, ఇరు జట్లూ తమ గత మ్యాచ్‌‌ల్లో చిత్తుగా ఓడిపోయి కాస్త డీలా పడ్డాయి.

ముంబై  8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ చేతిలో ఓడగా.. బెంగళూరు కూడా అన్నే వికెట్ల తేడాతో చెన్నై చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దాంతో, ఈ మ్యాచ్‌‌లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని రెండు టీమ్స్‌‌ ఆశిస్తున్నాయి.  ఈ మ్యాచ్‌‌కు కూడా రోహిత్‌‌ దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో సౌరభ్‌‌ తివారీ కొనసాగనున్నాడు. అతనితో పాటు సూర్యకుమార్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ మెరుపులు మెరిపిస్తుండడం జట్టుకు ప్లస్‌‌ పాయింట్. రాజస్తాన్‌‌పై ఫెయిలైనప్పటికీ క్వింటన్‌‌ డికాక్‌‌ ఫామ్‌‌లోనే ఉన్నాడు. హార్దిక్‌‌ పాండ్యా కూడా సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు. స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ కీరన్‌‌ పొలార్డ్​, క్రునాల్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపిస్తున్నారు కాబట్టి బ్యాటింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌పై ముంబైకి బెంగలేదు.

బౌలర్లు కూడా ఈ సీజన్‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేస్తున్నారు. అయితే, రాజస్తాన్‌‌ చేతిలో ఎదురైన చేదు జ్ఞాపకం నుంచి వాళ్లు వెంటనే బయట పడాల్సి ఉంది. మరోవైపు బెంగళూరు కూడా అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, దేవదత్‌‌ పడిక్కల్‌‌, ఏబీ డివిలియర్స్‌‌ సత్తా చాటుతున్నారు. ఆరోన్‌‌ ఫించ్‌‌ కాస్త నిలకడగా ఆడితే ఆ టీమ్‌‌కు తిరుగుండదు. అయితే, పేసర్‌‌ నవదీప్‌‌ సైనీకి గాయం కావడం ఒక్కటే జట్టును కలవర పెడుతోంది. అతని గురించి క్లారిటీ లేదు. ఒకవేళ సైనీ ఆడకపోతే ఆర్‌‌సీబీ బౌలింగ్‌‌ కచ్చితంగా వీక్‌‌ అవుతుంది. ఏదేమైనా రెండు పటిష్ట జట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించే అవకాశం ఉంది.