
- రాణించిన రస్సెల్, బౌలర్లు
- రియాన్ పరాగ్ పోరాటం వృథా
- రాయల్స్‌కు తొమ్మిదో ఓటమి
కోల్‌కతా: ఆండ్రీ రస్సెల్ (25 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 57 నాటౌట్) ఖతర్నాక్ బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు కూడా సత్తా చాటడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్–18లో ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఆదివారం సాయంత్రం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించిన కేకేఆర్ ఐదో విక్టరీతో ఆరో ప్లేస్‌కు చేరుకుంది. ఇంకోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ (45 బాల్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 95) అద్భుతంగా పోరాడినా.. ఆఖర్లో ఒత్తిడికి చిత్తయిన రాజస్తాన్ తొమ్మిదో ఓటమి ఖాతాలో వేసుకుంది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (44) కూడా రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో పరాగ్ పోరాడినా రాయల్స్ ఓవర్లన్నీ ఆడి 205/8 స్కోరు చేసి కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. కేకేఆర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మొయిన్ అలీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. రస్సెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆఖరి ఐదు ఓవర్లలో 85 రన్స్
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఆరంభంలో తడబడినా.. స్లాగ్ ఓవర్లలో రస్సెల్ జోరుతో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (11)ను రెండో ఓవర్లోనే యుధ్‌వీర్ సింగ్ స్లో బాల్‌తో బౌల్డ్ చేశాడు. ఇంకోవైపు ఆర్చర్ తన తొలి రెండు ఓవర్లలో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే, యుధ్‌వీర్ బౌలింగ్‌లోనే రహ్మనుల్లా గుర్బాజ్ ( 35) రెండు ఫోర్లు, కెప్టెన్ అజింక్యా రహానె (30) సిక్స్ కొట్టి వేగం పెంచడంతో పవర్ ప్లేను కేకేఆర్ 56/1తో ముగించింది. కానీ, ఎనిమిదో ఓవర్లో గుర్బాజ్‌ను ఔట్ చేసిన తీక్షణ రెండో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేయడంతో కేకేఆర్ స్పీడు తగ్గింది. స్పిన్నర్లు తీక్షణ, హసరంగతో పాటు కెప్టెన్ పరాగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు.
రహానెను 13వ ఓవర్లో పరాగ్ వెనక్కుపంపాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న అంగ్‌క్రిష్ రఘువంశీకి తోడైన రస్సెల్ సైతం తొలుత నెమ్మదిగా ఆడాడు. మొదటి 9 బాల్స్‌లో రెండు రన్స్ మాత్రమే చేశాడు. దాంతో 15 ఓవర్లకు కేఏఆర్ 121/3తో నిలిచింది. అయితే స్లాగ్ ఓవర్లలో అతను ఒక్కసారిగా విజృంభించాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4తో టాప్ గేర్‌లోకి వచ్చిన రస్సెల్.. ఆర్చర్ బౌలింగ్‌లో 6, 4 రాబట్టాడు. ఆపై తీక్షణ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
19వ ఓవర్లో రఘును ఆర్చర్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అయినా వెనక్కు తగ్గని ఆండ్రీ... ఆర్చర్ 148 కి.మీ వేగంతో వేసిన ఫుల్ టాస్‌ను స్క్వేర్ లెగ్‌పై సిక్స్ కొట్టి 22 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. మధ్వాల్ వేసిన చివరి ఓవర్లో రింకూ సింగ్ (19 నాటౌట్) వరుసగా 4, 6, 6తో స్కోరు 200 దాటించి ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. రస్సెల్ విధ్వంసంతో కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో 85 రన్స్ రాబట్టింది.
పరాగ్ పంజా విసిరినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఓ దశలో 71/5 నిలిచిన రాజస్తాన్‌ను స్టాండిన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అసాధారణ ఇన్నింగ్స్‌తో గెలుపు ముంగిట వరకూ తీసుకెళ్లినా.. చివర్లో గొప్పగా బౌలింగ్ చేసిన కేకేఆర్‌నే విజయం వరించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (34) ఆకట్టుకున్నా.. ‘బేబీ బాస్’ వైభవ్ సూర్యవంశీ (4) ఎదుర్కొన్న రెండో బాల్‌కే రహానెకు క్యాచ్ ఇచ్చాడు. అరంగేట్రం ఆటగాడు కునాల్ సింగ్ రాథోడ్ (0)ను రెండో ఓవర్లో మొయిన్ అలీ డకౌట్ చేయడంతో 8/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన పరాగ్, యశస్వితో కలిసి భారీ షాట్లు కొట్టడంతో పవర్ ప్లేను ఆర్‌ఆర్ 59/2తో ముగించింది.
కానీ, ఫీల్డింగ్ మారిన తర్వాత ఆ టీమ్ మరోసారి తడబడింది. అలీ బౌలింగ్‌లో జైస్వాల్ రింకూకు క్యాచ్ ఇవ్వగా.. ఎనిమిదో ఓవర్లో వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0), వానిందు హసరంగ (0) ఇద్దరినీ బౌల్డ్ చేయడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ ఎంతోసేపు నిలవదనిపించింది. కానీ, వైభవ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో మళ్లీ వేగం పెంచిన పరాగ్.. అలీ వేసిన 13వ ఓవర్లో వరుసగా ఐదు విక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించడంతో రాయల్స్ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది.
నరైన్ బౌలింగ్‌లో హెట్‌మయర్ (29) కూడా సిక్స్ బాదడంతో చివరి ఐదు ఓవర్లలో రాయల్స్‌కు 52 రన్స్ అవసరం అయ్యాయి. కానీ, తర్వాతి ఓవర్లో షార్ట్‌బాల్‌తో హెట్‌మయర్ ను ఔట్ చేసిన రాణా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తర్వాతి ఓవర్లో నరైన్ ఐదు రన్సే ఇవ్వగా.. సెంచరీ ముంగిట రాణా బౌలింగ్‌లో అరోరాకు క్యాచ్ ఇచ్చి పరాగ్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వెళ్లింది.
చివరి ఓవర్లో ఆ టీమ్‌కు 22 రన్స్ అవసరం అయ్యాయి. తొలి రెండు బాల్స్‌కు జోఫ్రా ఆర్చర్ (12) 2,1 తీయడంతో స్ట్రయికింగ్‌కు వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దూబే (25 నాటౌట్) తర్వాతి మూడు బాల్స్‌కు 6, 4, 6 కొట్టి రాజస్తాన్‌ను గెలిపించినంత పని చేశాడు. లాస్ట్ బాల్‌కు మూడు రన్స్ అవసరం అవ్వడంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. కెప్టెన్ రహానె తెలివైన ఫీల్డింగ్‌తో రింకూ సింగ్‌ను లాంగాఫ్‌లో ఉంచాడు. వైభవ్ వేసిన యార్కర్‌ను లాంగాఫ్ వైపు ఆడిన శుభం డబుల్ తీసే లోపే రింకూ విసిరిన త్రోకు ఆర్చర్ రనౌటవ్వడంతో కేకేఆర్ విజయ సంబరాలు
మొదలయ్యాయి.
సంక్షిప్త స్కోర్లు
- కోల్‌కతా: 20 ఓవర్లలో 206/4 (రస్సెల్ 57 నాటౌట్, రఘువంశీ 44, పరాగ్ 1/21)
- రాజస్తాన్: 20 ఓవర్లలో 205/8 (పరాగ్ 95, జైస్వాల్ 34, చక్రవర్తి 2/32)