అరబ్ గడ్డపై హంగామా..ఇవాళ్టి నుంచే ఐపీఎల్-13

అరబ్ గడ్డపై హంగామా..ఇవాళ్టి నుంచే ఐపీఎల్-13

అరబ్​ గడ్డపై అదిరిపోయే క్రికెట్​ హంగామా..
గ్రాండ్​ గాలా నైట్స్​లో.. హీటెక్కించే వేడిలో..
మోతెక్కనున్న పరుగుల ఆట..! ఫ్యాన్స్​ సందడి లేకపోయినా..
చీర్​ గాళ్స్​​ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. బాదుడుకు మాత్రం  కొదువలేదు.!  నూనూగు మీసాల కుర్రాళ్లు.. షార్ట్ ఫార్మాట్​ స్పెషలిస్ట్​లు.. అనుభవజ్ఞుల ఆతిథ్యంతో మెగా లీగ్​ స్పెషల్​గా రెడీ అయ్యింది. కరోనాను పక్కనబెడుతూ.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు కాకలు తీరిన క్రికెట్​ యోధులు బ్యాట్లు దూస్తున్నారు. దీంతో సిక్సర్ల సునామీలో, పరుగుల తుఫాన్​లో ఎడారి దేశం అదిరిపోనుంది. ఫస్ట్​ టైమ్​ టీవీ ఈవెంట్​గా మారిపోయినా.. ఎక్స్​ట్రా వేషాలన్నీ ఈ సూపర్​ ఎక్స్​ట్రావాగంజాలో షో చేయడానికి  సిద్ధంగా ఉన్నాయి. సో చూసినోడికి చూసినంతా.. ఆడినోడికి  ఆడినంత..! 8 టీమ్​లు.. 53 రోజులు.. 60 మ్యాచ్​లు.. 200లకు పైగా ప్లేయర్లు.. క్షణం తీరిక లేకుండా.. నిమిషం పక్కకు పోకుండా.. బంతి అరుపులు.. బ్యాట్​ విరుపుల మధ్య… కళ్లకు కనువిందు చేసేందుకు ఐపీఎల్​–13 సిద్ధమైంది. పుష్కరకాలంగా లీగ్​ను ఏలుతున్న చెన్నై సూపర్​కింగ్స్​, ముంబై ఇండియన్స్​ మధ్య నేడు జరిగే  ​ మ్యాచ్​తో పవర్​ హిట్టింగ్​ ఆటకు ఫస్ట్​ షో పడనుంది…!

అబుదాబివికెట్ల వెనుకాల మహేంద్రుడి మాయాజాలం.. మైదానంలో విరాట్​ భావోద్వేగాలు..  హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ అలుపెరగని పోరాటం… ఇలా ఒక్కటేమిటి.. గతంలో క్రికెట్​ ప్రపంచం చూడని ఎన్నో వింతలు.. మరెన్నో విన్యాసాలను పంచేందుకు ఐపీఎల్​–13 సిద్ధమైంది. కరోనాతో ప్రపంచం మొత్తం వణికిపోతున్న వేళ.. దానిని మరిచిపోయి  ఎంజాయ్​ చేసే స్థాయిలో.. ఈసారి ఆట ఉండబోతున్నది. ఫారిన్‌ స్టార్లతో పాటు లోకల్ కుర్రాళ్లతో మాంచి కిక్​ ఇచ్చే మ్యాచ్​లు మన ముందుకు రాబోతున్నాయి. ముంబై ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్​తో  ఈ గ్రాండ్​ మెగా లీగ్​కు శనివారం తెరలేవనుంది. ఓపెనింగ్​ షోతోనే ప్రపంచ ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు ఆర్గనైజర్స్‌ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.

53 రోజుల అల్టిమేట్‌ వార్‌‌..

ఈవెంట్​ ఇండియాలో కాదు.. స్టేడియాల్లో ప్రేక్షకులు ఉండరు.. అయినా లీగ్​కు మాత్రం విపరీతమైన క్రేజ్​ వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇండియా స్పోర్ట్స్​కు ఈ లీగ్​ రీస్టార్ట్​ బటన్​. గత కొంతకాలంగా ఇండియా ప్రైమ్​ టైమ్​ను ఆక్రమించేసిన బాలీవుడ్​ సినిమాలకు ఇక నుంచి ఎండ్​ కార్డ్​ పడ్డట్లే. రాబోయే 53 రోజులు.. ఫుల్​ క్రికెట్​ హంగామాతో ఇండియన్​ ఫ్యాన్స్​ సేద తీరనున్నారు. రాబోయే రెండు నెలలు ఇండియాలో ఎక్కడ చూసినా ధోనీ, కోహ్లీ, రోహిత్​ పేర్లే వినబడతాయి. రాహుల్​, శ్రేయస్​, పంత్​ మధ్య పోటీ గురించే చర్చ జరగనుంది. ఫారిన్​ కంట్రీలో, క్లోజ్డ్​ డోర్స్​ మధ్య, బయో బబుల్​ సెక్యూర్​లో ఆడటం కూడా ప్లేయర్లకు కొత్త ఎక్స్​పీరియెన్స్​. లీగ్​ దశలో 56 మ్యాచ్​లు జరగనున్నాయి. అబుదాబి, షార్జా, దుబాయ్​ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబర్​ 10న జరిగే మెగా ఫైనల్​తో ఐపీఎల్​ ముగుస్తుంది. అరబ్‌ కంట్రీలో హీట్‌ నేపథ్యంలో ఈసారి డబుల్​ హెడర్​ మ్యాచ్​ల సంఖ్యను తగ్గించారు. కేవలం 10 రోజులు మాత్రమే రెండు మ్యాచ్​లు జరగనున్నాయి.

పోటీ ఎక్కువే..

గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా ఐపీఎల్​లో గట్టిపోటీ తప్పకపోవచ్చు. ఎందుకంటే పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న జరిగిన వేలంలో ఫ్రాంచైజీలన్నీ తమ టీమ్​లను సమూలంగా మార్చేసుకున్నాయి. దీంతో ప్రతి టీమ్​.. ఇంటర్నేషనల్​ స్టార్లతో కళకళలాడుతున్నది. ఫ్యూచర్​లో తమ జాతీయ జట్లకు ఆడాలని కోరుకుంటున్న దేశవాళీ కుర్రాళ్లు కూడా బ్యాట్లు ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నారు. గత 12 సీజన్లలో ముంబై ఇండియన్స్​ అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్​ కొడితే, చెన్నై సూపర్​కింగ్స్​ మూడుసార్లతో రెండో స్థానంలో ఉంది. కోల్​కతా నైట్​రైడర్స్​ రెండుసార్లు విజేతగా నిలిచింది. రాజస్తాన్​ రాయల్స్​, డెక్కన్​ చార్జర్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఒక్కో టైటిల్​ను సాధించాయి. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్​ ఈసారి భారీ ప్లాన్స్​ను సిద్ధం చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రతి మ్యాచ్​లో గట్టిపోటీ తప్పకపోవచ్చు. గేల్​, వార్నర్​ కొట్టే టవరింగ్​ సిక్స్​లకు చీర్స్​ చెప్పే ప్రేక్షకులు లేకపోవచ్చు… సూపర్​ ఓవర్​లో ఉండే ఉత్కంఠ మిస్​ కావొచ్చు… కానీ ప్రపంచం మొత్తం హెల్త్​ క్రైసిస్​తో బాధపడుతున్న టైమ్​లో ఐపీఎల్​ జరగడం నిజంగా మంచి పరిణామమే.

కొత్తగా.. వింతగా..

ఐపీఎల్‌ అంటేనే కిక్కిరిసిపోయే స్టేడియాలు.. ప్రేక్షకుల కేరింతలు.. చీర్‌‌ లీడర్స్‌ చిందులు.. సెలబ్రిటీల తళుకులు..  స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ తెగ సందడి ఉండడం కామన్. గత పన్నెండేళ్లుగా మనం చూస్తున్న లీగ్‌ అదే. కానీ 13వ సీజన్‌ మాత్రం చాలా కొత్తగా.. వింతగా కనిపించనుంది. రెగ్యులర్‌‌గా ఇండియన్‌ సమ్మర్‌‌లో అలరించే మెగా లీగ్‌…ఈ సారి  అరేబియన్‌ కంట్రీలో అలరించనుంది. మార్చి–మే మధ్య జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా ఫస్ట్‌ టైమ్‌ సెప్టెంబర్‌‌–నవంబర్‌‌ విండోకు షిఫ్ట్​ అయింది. ఓవైపు కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతుండగా.. అసలు జరుగుతుందో  లేదో అనిపించిన ఐపీఎల్‌ను పట్టాలెక్కించేందుకు సౌరవ్‌ గంగూలీ నాయకత్వంలోని బీసీసీఐ చాలా కష్టపడింది. టీ20 వరల్డ్​కప్​ను పోస్ట్‌పోన్‌ చేసేలా ఐసీసీని ఒప్పించి మెగా లీగ్‌ను పట్టాలెక్కించిన బోర్డు దాన్ని సజావుగా గమ్యాన్ని చేర్చేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.  యూఏఈలో బయో బబుల్‌ క్రియేట్‌ చేసి లీగ్‌లో ఇన్వాల్వ్‌ అయిన ప్రతి ఒక్కరినీ అందులోబంధీ చేసి.. ఆరంభ వేడుకలు సహా అనేక ఈవెంట్లను రద్దు చేసింది. ప్లేయర్లు, కోచింగ్‌ స్టాఫ్, అఫీషియల్స్‌కు స్ట్రిక్ట్‌ రూల్స్‌ పెట్టింది.

ఇన్నాళ్లూ  దారి పొడవునా ప్రేక్షకులు స్వాగతం పలుకుతుండగా స్టేడియానికి వచ్చే ప్లేయర్లు ఇప్పుడు బస్సులో కూడా దూరం దూరంగా కూర్చొని, ముఖానికి మాస్కుతో ఎవ్వరినీ టచ్‌ చేయకుండా గ్రౌండ్‌లోకి రానున్నారు. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్టీ స్టేడియాల్లో  ఎలాంటి హడావుడి లేకుండా ఆడడం ప్లేయర్లకు కొత్త ఎక్స్​పీరియన్స్. వాళ్లు సిక్సర్ ​కొట్టినా, వికెట్‌ తీసినా ఉత్సాహపరచడానికి ఫ్యాన్స్‌ ఉండరు.. చీర్‌‌ లీడర్స్‌ కనిపించరు. మ్యాచ్‌ టైమ్‌లో కూడా ప్లేయర్లు దూరం దూరంగా సెలబ్రేషన్స్‌ చేసుకోవాల్సి పరిస్థితి. ఇక, ఖాళీ స్టేడియాల్లో ఆట యంగ్‌స్టర్స్‌కు అడ్వాంటేజ్‌ కానుండగా.. ఫ్యాన్స్‌ కేరింతలు కొడుతుంటే మరింత రెచ్చిపోయే కోహ్లీ, రోహిత్‌ వంటి స్టార్లకు కొంత వింత అనుభూతి. ప్లేయర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌  ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా స్టేడియానికి రానివ్వడం కాస్త ఊరట.  మ్యాచ్‌ ముందు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, టాస్‌ టైమ్‌లో కెప్టెన్ల చేతిలో టీమ్‌ లిస్ట్‌ పేపర్లు ఉండవు. పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా వర్చువల్‌గా జరగనుంది. అన్నింటికి మించి దాదాపు ఆరు నెలల బ్రేక్‌ తర్వాత ఇండియన్‌ ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి.

ఐపీఎల్​ విన్నర్స్​

ముంబై- 4 (2013, 15, 17, 19)

చెన్నై – 3 (2010, 11,18)

కోల్​కతా- 2 (2012,14)

రాజస్తాన్​- 1 (2008)

డెక్కన్​ చార్జర్స్​- 1 (2009)

సన్​రైజర్స్​ 1 (2016)