జూబ్లీహిల్స్, వెలుగు: మహిళల యూరాలజీ సమస్యలకు ప్రత్యేక వైద్య సేవలు అందించే లక్ష్యంతో బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ఐపీఎస్ అధికారి షికా గోయల్ గురువారం ప్రారంభించారు. పూర్తిగా మహిళా డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులతో కూడిన ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని ఆమె కొనియాడారు.
మహిళల్లో పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవగాహన లోపంతో చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారని డాక్టర్లు తెలిపారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సమగ్ర నిర్ధారణతో పాటు ఆధునిక చికిత్సలను ఒకే చోట అందించేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దామన్నారు.
