- యుద్ధ విరమణ, హార్మూజ్, అణు కార్యక్రమాలు దశలవారీగా అమలు చేయాలని డిమాండ్
- పాక్ మధ్యవర్తిత్వం వద్దన్న ఇరాన్ ఎంపీ
- ఆ దేశానికి విశ్వసనీయత లేదని మండిపాటు
టెహ్రాన్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలను తొలగించేందుకు ఇరాన్ తాజాగా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన వేళ అమెరికా ముందు మూడు దశల శాంతి ప్రతిపాదనను పెట్టింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపేయడంపై ముందుగా దృష్టి సారించాలని, ఆ తర్వాత హార్మూజ్ జలసంధిని తెరవడం, చివరగా అణు కార్యక్రమాలపై చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదించింది.
ముందుగా యుద్ధం ఆపేయడం ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. అయితే, యుద్ధ విరమణ తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన జరగాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ భూభాగంపై కానీ, తమ మద్దతుదారు లెబనాన్ పై కానీ భవిష్యత్తులో యుద్ధం చేయబోమని అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతోంది. రెండో దశలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ప్రధాన లక్ష్యం. ఈ మార్గం మూసివేయడం వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడుతోంది.
అత్యంత వివాదాస్పదమైన అణు అంశాన్ని వెంటనే కాకుండా చివరి దశలో చర్చించాలని ప్రతిపాదించింది. అణు అంశాన్ని కాస్త వాయిదా వేయడం ద్వారా గతంలో చర్చలను దెబ్బతీసిన అంశాలను నివారించవచ్చని ఇరాన్భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కొత్త ప్రపోజల్ హార్మూజ్ జలసంధి సంక్షోభాన్ని, అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ముందుగా పరిష్కరించడంపై దృష్టి సారిస్తున్నది. పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రపోజల్‌ను అమెరికాకు అందజేసింది. అయితే, అమెరికా నౌకా దిగ్బంధం తొలగించే వరకు చర్చలకు వెళ్లేది లేదని ఇరాన్, శాంతి ఒప్పందం కుదిరే వరకు నౌకా దిగ్బంధం ఉపసంహరించుకోబోమని అమెరికా పట్టుబడుతున్నాయి. ఇరు పక్షాలు తమ వాదనలపై పట్టుదలతో ఉన్న నేపథ్యంలో.. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పాక్ మధ్యవర్తిత్వంపై విమర్శలు
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రపై ఇరాన్‌లోని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న పార్లమెంటు సభ్యుడు ఇబ్రహీం రెజాయీ సోమవారం మాట్లాడుతూ పాకిస్తాన్ మంచి పొరుగు దేశమే అయినప్పటికీ అది చర్చలకు తగిన మధ్యవర్తి కాదని అన్నారు. మధ్యవర్తిత్వం వహించడానికి అవసరమైన విశ్వసనీయత ఆ దేశానికి లేదన్నారు. అలాగే ఇస్లామాబాద్‌లో దౌత్య చర్చలకు అనుకూల పరిస్థితులు లేవని పేర్కొన్నారు.
పాకిస్థాన్ నేతలు అమెరికా పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, వారు ప్రతిసారి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటారని, అమెరికన్ల కోరికలకు వ్యతిరేకంగా మాట్లాడరని రెజాయీ ఆరోపించారు. ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు కూడా పాకిస్తాన్‌ను పూర్తిగా నమ్మలేమని పేర్కొన్న సంగతి తెలిసిందే. మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలనీ, ఒక పక్షానికి మొగ్గు చూపకూడదని స్పష్టం చేశారు. అయితే తమ మధ్యవర్తిత్వంలో రెండు వర్గాల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయని పాక్ అధికారులు పేర్కొంటున్నారు.

