- హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి
- యూఎస్ ఆర్మీ వాటిని కూల్చేసిందని ‘ది జెరూసలేం పోస్ట్’ కథనం
టెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన పీస్ డీల్ కేవలం కాగితాలకే పరిమితమైందని, హార్మూజ్ లో వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడికి యత్నించిందని ‘ది జెరూసలెం పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. శాంతి ఒప్పందాన్ని కాలరాస్తూ హార్మూజ్ గుండా వెళ్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) పలు డ్రోన్లను ప్రయోగించినట్లు పేర్కొంది.
అయితే, ఈ డ్రోన్లు వాణిజ్య నౌకలకు గానీ, అక్కడ మోహరించిన అమెరికా సైనిక బలగాలకు గానీ ఎలాంటి నష్టం కలిగించకముందే యూఎస్ మిలిటరీ వాటిని గాల్లోనే అడ్డుకుని, కూల్చివేసిందని అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య 3 నెలలుగా నడుస్తున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించిన 3 రోజులకే ఈ దాడి జరగడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై రోడ్‌మ్యాప్ రూపొందించడానికి, జలసంధిని పూర్తిగా తెరవడానికి అమెరికా, ఇరాన్ అధికారిక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం గమనార్హం.
శాంతి ఒప్పందానికి పొంచి ఉన్న ముప్పు!
అమెరికా– ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు సాగుతున్నప్పటికీ.. గల్ఫ్ రీజియన్‌లో ఉద్రిక్తతలను అదుపు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనికితోడు అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) ఇచ్చిన నివేదిక ప్రపంచ దేశాలను మరింత భయపెడుతోంది. భవిష్యత్తులో హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే లేదా అస్తవ్యస్తం చేసే సైనిక సామర్థ్యాన్ని ఇరాన్ గణనీయంగా పెంచుకుందని ‘సీఎన్ఎన్’ ఒక కథనంలో పేర్కొంది. ఇటీవలి యుద్ధం ద్వారా ప్రాంతీయ ఇంధన వనరులపై, నౌకా రవాణా మార్గాలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీయవచ్చో ఇరాన్ సైనిక వ్యూహకర్తలు బాగా వంటబట్టించుకున్నారని ఈ నివేదిక హెచ్చరించింది.
