- కువైట్, బహ్రెయిన్ పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు
- ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా అటాక్స్
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- రేపటితో అమెరికా, ఇరాన్ యుద్ధానికి 100 రోజులు
టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, -ఇరాన్ యుద్ధం వంద రోజులకు చేరువవుతున్న తరుణంలో పశ్చిమాసియాలో మరోసారి దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అటాక్స్ చేయగా.. హార్మూజ్ జలసంధి ప్రాంతంలోని గోరుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి.
కువైట్ ఆకాశంలో క్షిపణులను ఇంటర్ సెప్టర్లు అడ్డుకుంటున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించగా, బహ్రెయిన్ గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశించగా, పెద్ద ఎత్తున సైరన్లు మోగాయి. కువైట్, బహ్రెయిన్ వైపు ఇరాన్ ప్రయోగించిన నాలుగు వన్-వే ఎటాక్ డ్రోన్లను అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు తెలిపారు. ఈ రెండు దేశాలపైకి ఏడు బాలిస్టిక్ క్షిపణులను కూడా ఇరాన్ ప్రయోగించిందని.. వీటిలో ఆరింటిని తాము అడ్డుకున్నామని, ఏడవది దాని నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని తెలిపారు.
‘‘ప్రస్తుతం అమెరికా సిబ్బందికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని దెబ్బతీశామన్న ఇరాన్ వాదనలు అబద్ధం” అని పేర్కొన్నారు. కువైట్‌లో అమెరికా దళాలు ఉన్న అల్ సాలెం వైమానిక స్థావరాన్ని, బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ 5వ నౌకాదళాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇర్నా వార్తా సంస్థ వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ వ్యక్తి మరణించి, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి.
అయితే, ఈ తాజా ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి ఆరోపించారు. కువైట్ వైపు వెళ్లే ప్యాసింజర్ విమానాలు తమ మార్గాలను మార్చుకోవాలని హెచ్చరించారు. దేశ పౌరులు విమానాశ్రయాలకు దూరంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. ఫ్లైట్‌రాడార్24 సంస్థ సమాచారం ప్రకారం, తాజా దాడుల నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో 24 విమానాలు రద్దు కాగా,15 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశం మీదుగా ప్రయాణించే ఎయిర్ రూట్ వేగంగా ఖాళీ అయిపోయింది.
యుద్ధానికి త్వరలోనే ముగింపు: ట్రంప్
తాజా దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగిన తరుణంలో ఈ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఇరాన్‌తో శాంతి చర్చలు చాలా బాగా సాగుతున్నట్లు కనిపిస్తోంది” అని అన్నారు. ‘‘మనం ఇరాన్ నుంచి చాలా త్వరగా బయటపడబోతున్నాం. అది ఒక కాగితం ముక్క (ఒప్పందం) ద్వారా అయినా లేదా చాలా కఠినమైన మార్గంలో అయినా, ఏదో ఒక రకంగా అది జరగబోతోంది’’ అని శుక్రవారం విస్కాన్సిన్‌లో జరిగిన రైతుల కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘‘చాలా కఠినమైన మార్గం బహుశా సులువైన మార్గం కావచ్చు. కానీ మనం బయటకు వస్తాం, మీ ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం ఉన్నట్లే చాలా తగ్గిపోతాయి” అని తెలిపారు.
