మీ మొండి పట్టు వీడండి: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్

మీ మొండి పట్టు వీడండి: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్

టెహ్రాన్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ముగించేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ ఏకపక్ష, మొండి వైఖరి వీడాలని చురకలంటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ట్రంప్ ఏకపక్ష వైఖరి వీడి మిడిల్ ఈస్ట్‎లో శాంతి కోసం ఇరాన్ ప్రతిపాదించిన చట్టబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. 

ఇరాన్ ప్రతిపాదనలు తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు పశ్చిమాసియాలో స్థిరత్వానికి మద్దతు ఇచ్చేలా రూపొందించబడ్డాయని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రపోజల్స్ సహేతుకమైనవని పేర్కొన్నారు. అమెరికా తమ అసమంజమైన డిమాండ్లు పక్కనపెట్టి ఇరాన్ ప్రతిపాదనలను అంగీకరించాలని సూచించారు. అలాగే, మిడిల్ ఈస్ట్‎లో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోందన్న అమెరికా ఆరోపణలను బఘాయీ తోసిపుచ్చారు. అమెరికా మాదిరిగా మేం ఎవరిపై దౌర్జన్యం చేసేవాళ్లం కాదని.. తమ దేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని నొక్కి చెప్పారు. 

క్యూబా, వెనిజులా వంటి దేశాలపై అమెరికా దండెత్తిన మాదిరిగా మేం వ్యవహరించడం లేదని కౌంటర్ ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం, హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, సముద్రపు దోపిడీ చర్యలను ఆపడం, అమెరికా ఒత్తిడితో బ్యాంకులలో అన్యాయంగా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి ఇరాన్  ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించాలన్నారు. హోర్ముజ్ జలసంధిలో బాహ్య జోక్యంపై హెచ్చరిస్తూ.. ప్రాంతీయ భద్రతను ప్రాంతీయ దేశాలే నిర్వహించాలని నొక్కి చెప్పారు.

పశ్చిమాసియాలో దాదాపు రెండున్నర నెలలుగా సాగుతోన్న ఉద్రిక్తతలను ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కీలకమైన ప్రపోజల్స్ పంపింది. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సున్నితంగా తిరస్కరించారు. ఇరాన్ ప్రపోజల్స్ ఏ మాత్రం అమోదయోగ్యంగా లేవని.. అవి నాకు నచ్చలేదన్నారు ట్రంప్.