రూ.లక్ష కోట్ల సాగు ఎగుమతులకు యుద్ధ గండం

రూ.లక్ష కోట్ల సాగు ఎగుమతులకు యుద్ధ గండం
  • ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు పెరగడమే కారణం
  • ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ రైతులకు నష్టం

న్యూఢిల్లీ:  ఇరాన్‌‌‌‌, అమెరికా యుద్ధం ప్రభావం భారత వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై  తీవ్రంగా  ఉంటుందని  గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) పేర్కొంది. గల్ఫ్ మార్కెట్ మనకు చాలా ముఖ్యమని తెలిపింది. ఈ సంస్థ ప్రకారం,  కిందటేడాది  వెస్ట్ ఏసియా దేశాలకు సుమారు  11.8 బిలియన్ డాలర్ల (రూ.1.08లక్షల కోట్ల)  విలువైన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మసాలాలు వంటి ఉత్పత్తులను ఇండియా ఎగుమతి చేసింది. ఇది మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 21.8 శాతానికి సమానం. ప్రస్తుతం ఈ ఎగుమతులు తగ్గిపోనున్నాయి.

 గల్ఫ్ ఏరియా ఇండియాకు దగ్గరగా ఉండడం,  భారతీయ ప్రవాసులు ఎక్కువగా ఉండడంతో మన వ్యవసాయ ఉత్పత్తులకు సహజ మార్కెట్‌‌‌‌గా ఉంది. కానీ యుద్ధం కారణంగా షిప్పింగ్ మార్గాల్లో  అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా  ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. లాజిస్టిక్స్‌‌‌‌లో అనిశ్చితి నెలకొంది.   బియ్యం ఎగుమతులపై యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. 2025లో భారత్  4.43 బిలియన్ డాలర్ల విలువైన బియ్యాన్ని పశ్చిమాసియాకు ఎగుమతి చేసింది. ఇది గ్లోబల్ బియ్యం ఎగుమతుల్లో 36.7శాతం వాటాకు సమానం. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

 అదనంగా, అరటిపండ్లు (396.5 మిలియన్ డాలర్లు), ఉల్లిపాయలు, వెల్లుల్లి (111 మిలియన్ డాలర్లు), మసాలాలు ( 295.5 మిలియన్ డాలర్లు), కాఫీ  (240.7 మిలియన్ డాలర్లు), టీ (410.1 మిలియన్ డాలర్లు), ప్రాసెస్‌‌‌‌డ్ ఫుడ్, చక్కెర, కోకో (1.35 బిలియన్ డాలర్లు), చేపలు, మాంసం (1.81 బిలియన్ డాలర్లు) వంటి ఉత్పత్తులు కూడా గల్ఫ్ మార్కెట్‌‌‌‌కు పెద్ద ఎత్తున వెళ్తున్నాయి.