- అమెరికాకు మద్దతిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఫైర్
టెహ్రాన్: తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ చమురు బావులను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ పై ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ సాఘబ్ ఎస్ఫహానీ తీవ్రంగా మండిపడ్డారు. ఒకవేళ ఇరాన్ చమురు బావులపై, మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశానికి మద్దతిచ్చే గల్ఫ్ దేశాల చమురు బావులను నాలుగు రెట్లు ఎక్కువగా ధ్వంసం చేస్తామని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
"మేం ఏ రకమైన యుద్ధ చర్యకైనా ప్రతిస్పందిస్తం. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు ఆగిపోయాయి. చమురు తీయడం ఆగిపోతే మా బావులలో సాంకేతిక సమస్యలు రావచ్చు. లేదా నిల్వలు పెరిగి నష్టం వాటిల్లవచ్చు. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, చమురు క్షేత్రాలకు ఏవైనా నష్టం కలిగితే ఇరాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. అమెరికాకు మద్దతిచ్చే దేశాలకు నాలుగు రెట్లు నష్టం కలిగిస్తం. మా లెక్కలు భిన్నంగా ఉంటాయి. మాకు ఒక చమురు బావి అంటే 4 చమురు బావులతో సమానం" అనిఎస్ఫహానీ హెచ్చరించారు.
ఇది అమెరికాకే ప్రమాదకరం
ట్రంప్ కామెంట్లపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ కూడా స్పందించారు. ఈ వివాదాన్ని పేకాటతో పోల్చారు. ఇరాన్ వద్ద సప్లయ్ కార్డులు ఉన్నాయని.. హార్మూజ్ జలసంధితో పాటు బాబ్ ఎల్-మందేబ్, అంతర్జాతీయ పైప్‌లైన్లను మూసివేసే శక్తి తమకు ఉందని తెలిపారు. అమెరికా ఇప్పటికే తన అత్యవసర చమురు నిల్వలను వాడేసిందని, ఇప్పుడు ఇరాన్ గనుక చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే ప్రపంచ మార్కెట్‌లో నెలకొనే డిమాండ్‌ను తట్టుకోవడం అమెరికా వల్ల కాదని చెప్పారు.
ముఖ్యంగా అమెరికాలో సమ్మర్ హాలిడేస్ సీజన్ ప్రారంభం కాబోతోందని.. ఈ టైంలో ప్రజలు విపరీతంగా ప్రయాణాలు చేస్తారని, అప్పుడు ఇంధన కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయన్నారు.

