చేతులు ముడ్చుకుని కూర్చొం.. దెబ్బకు దెబ్బ తీస్తం: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ రీ కౌంటర్

చేతులు ముడ్చుకుని కూర్చొం.. దెబ్బకు దెబ్బ తీస్తం: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ రీ కౌంటర్

టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని తెరిగి తెరవకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలను ఎక్కడిక్కడ పేల్చేస్తామన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరింపులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడులు చేస్తుంటే చేతులు ముడ్చుకుని చూస్తూ కూర్చొమని.. తమ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా అదే రేంజ్‎లో ప్రతిస్పందిస్తుందని హెచ్చరించింది ఇరాన్. 

ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై దాడులు జరిగితే అంతే స్థాయిలో బదులిచ్చేందుకు ఇరాన్ సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మాపై దాడి చేస్తే మేం గల్ఫ్‎లోని యూఎస్ సైనిక స్థావరాలు, ఆ దేశ టెక్ కంపెనీలు, ఆయిల్ చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తామని స్పష్టం చేశారు. 

ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనాలు లక్ష్యంగా దాడులు చేస్తామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ట్రంప్ ఒక అస్థిరమైన, భ్రమల్లో బతికే వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. హార్మూజ్ జల సంధి ప్రపంచ దేశాలన్నింటికీ తెరిచే ఉంటుందని.. కేవలం ఇరాన్ శత్రవులకు మాత్రం హార్మూజ్ జల సంధి మూసివేసి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‎కు త్వరలోనే పెద్ద షాక్ ఇస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ వరుస వార్నింగ్స్:

హార్మూజ్ జల సంధిని తెరిచేందుకు విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్‎కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హార్మూజ్ జల సంధిని తెరవండి రా పిచ్చి వెదవల్లారా.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ పరుష పదజాలంతో దూషించారు. సోమవారం నాటికి అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. ఒకవేళ అగ్రిమెంట్‎పై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలన్నింటినీ  పేల్చివేస్తామని బెదిరించారు.

‘‘ఇరాన్‎తో చర్చలు జరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 6) ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశంలోని మౌలిక సదుపాయాలు అన్నింటిని పేల్చేస్తాం. అలాగే, ఇరాన్‎లోని చమరు వనరులను స్వాధీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఇరాన్ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో హార్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ పదే పదే ఇరాన్‎ను బెదిరిస్తున్నాడు. కానీ ఈ బెదిరింపులను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు.