బోణీ రోజే IRCTC జాక్​పాట్​

బోణీ రోజే IRCTC జాక్​పాట్​

100 శాతం లాభం
వెలుగు బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌  : సోమవారం లిస్టింగ్‌‌లోనే అదరగొట్టిన ఐఆర్‌‌సీటీసీ లాగే ఇండియా ఈక్విటీ మార్కెట్‌‌ హిస్టరీలో మరికొన్ని షేర్లున్నాయి. లిస్టింగ్‌‌ రోజునే ఐఆర్‌‌సీటీసీ 100 శాతం ప్రీమియం సంపాదించుకుంది. ఇన్వెస్టర్ల పంట పండించింది. లిస్టింగ్‌‌లో అదరగొట్టిన కొన్ని షేర్లు ఆ తర్వాత పెన్నీ షేర్లుగా మిగిలిపోయాయి. అద్భుతమైన లిస్టింగ్‌‌తో మొదలైన ఓ పది కంపెనీల షేర్లను చూద్దాం. 2006లో స్టాక్‌‌ మార్కెట్‌‌ ఎంట్రీ ఇచ్చిన తాంతియా కన్‌‌స్ట్రక్షన్స్‌‌ 260 శాతం ప్రీమియంతో రూ. 180 వద్ద లిస్టైంది. జీసీఎం సెక్యూరిటీస్‌‌ 2013లో, ఎఫ్‌‌సీఎస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ సొల్యూషన్స్‌‌ 2005 లో లిస్టింగ్‌‌ రోజునే 200 శాతానికి పైగా ప్రీమియం పొందాయి. వాటిలో తాంతియా కన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఇష్యూ ధర రూ. 45–50 మధ్యలో ఉండగా, ఎఫ్‌‌సీఎస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ సొల్యూషన్స్‌‌ ఇష్యూ ధర రూ. 50.

2017 గోల్డెన్‌‌ ఇయర్‌‌…

గత అయిదేళ్లలో చూస్తే, ఐపీఓ ఇన్వెస్టర్లకు పంట పండించింది 2017 కేలండర్‌‌ సంవత్సరమే. ఆ ఏడాదిలో మూడు ఐపీఓలు నూరు శాతం ప్రీమియంతో లిస్టింగ్ పొందాయి. అవెన్యూ సూపర్‌‌ మార్ట్స్‌‌, సలసార్‌‌ టెక్నో ఇంజినీరింగ్‌‌, ఆస్ట్రాన్‌‌ పేపర్‌‌ అండ్‌‌ బోర్డ్‌‌ మిల్‌‌లు 2017 లోనే  లిస్టయ్యాయి. ఆశ్చర్యకరమేమంటే, అత్యధిక ప్రీమియమ్‌‌లతో లిస్టైన కొన్ని ఐపీఓలు ఆ తర్వాత తుస్సుమని పెన్నీ స్టాక్స్‌‌గానూ మారిపోయాయి. ఎఫ్‌‌సీఎస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ చివరి క్లోజింగ్‌‌ ధర 20 పైసలైతే, తాంతియా కన్‌‌స్ట్రక్షన్స్‌‌ చివరి క్లోజింగ్‌‌ ధర రూ. 1.40. మ్యాక్స్‌‌ ఎలర్ట్‌‌ సిస్టమ్స్‌‌ కూడా లిస్టింగ్‌‌ రోజునే 157 శాతం ప్రీమియంతో అదరగొట్టింది. ఇప్పుడు ఈ షేరు రూ. 4.80 పలుకుతోంది. 225 శాతం ప్రీమియంతో లిస్టైన జీసీఎం సెక్యూరిటీస్‌‌ ప్రస్తుతం రూ. 9.40 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 53 శాతం తక్కువ.

ఐతే, మూడు షేర్లు మాత్రం స్టాక్‌‌ మార్కెట్‌‌ ఎంట్రీ తర్వాత ఇన్వెస్టర్లకు  సంపద తెచ్చిపెట్టాయి. 150 శాతం ప్రీమియంతో లిస్టైన ఇంద్రప్రస్థ గ్యాస్‌‌ షేర్‌‌ ఆ తర్వాత ఇష్యూ ధర కంటే ఎనిమిది రెట్లు ఎక్కువైంది. అలాగే డీ–మార్ట్‌‌ నడిపే ఎవెన్యూ సూపర్‌‌మార్ట్స్‌‌ ప్రస్తుతం ఇష్యూ ధర రూ. 1,843 తో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువకు ట్రేడవుతోంది. 2004 లో స్టాక్‌‌ మార్కెట్‌‌ ఎంట్రీ ఇచ్చిన టీవీ టుడే నెట్‌‌వర్క్‌‌ లిస్టింగ్ రోజే 121 శాతం ప్రీమియం పొందింది. ఇష్యూ ధరతో పోలిస్తే షేర్‌‌ మూడు రెట్లు ఎక్కువగా ఇప్పుడు పలుకుతోంది.

ఐఆర్‌‌సీటీసీ లెక్క వేరు…

లిస్టింగ్‌‌ తర్వాత తుస్సుమనే కేటగిరీలోకి ఐఆర్‌‌సీటీసీ రాదని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఐఆర్‌‌సీటీసీ బిజినెస్‌‌ మోడల్‌‌ వినూత్నమైనదని, కేటరింగ్‌‌, ఈ–టికెటింగ్‌‌, ప్యాకేజ్డ్‌‌ డ్రింకింగ్‌‌ వాటర్‌‌లలో ఈ కంపెనీకి తిరుగులేని ఆధిపత్యం ఉండటమే దానికి కారణమని చెబుతున్నారు. గతంలో ఈ–టికెటింగ్‌‌ మీద ఐఆర్‌‌సీటీసీ ఛార్జీలు వసూలు చేసేది. కానీ, ప్రభుత్వం దానిని నిలిపివేసింది. నాన్‌‌ ఏసీ టికెట్లపై రూ. 15, ఏసీ టికెట్లపై రూ. 30 చొప్పున సర్వీస్‌‌ ఛార్జీలను ఐఆర్‌‌సీటీసీ విధించేది. భవిష్యత్‌‌లో మళ్లీ ఈ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఐఆర్‌‌సీటీసీకి రావొచ్చు. ఒకవేళ అదే జరిగితే ఐఆర్‌‌సీటీసీ లాభం ఇప్పుడున్న రూ. 240 కోట్ల నుంచి 2021 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రెట్టింపై రూ.450 కోట్లకు చేరుతుందని ఐసీఐసీఐ డెరెక్ట్‌‌ ఎనలిస్టు దేవాంగ్‌‌ భట్‌‌ చెప్పారు.

ఇలాంటి షేర్లు అరుదు….

రైట్స్‌‌, రైల్‌‌ వికాస్‌‌ నిగమ్‌‌, ఇర్కాన్‌‌ల తర్వాత లిస్టింగ్‌‌ పొందిన నాలుగో రైల్వే కంపెనీగా ఐఆర్‌‌సీటీసీ నిలుస్తోంది. మార్చి 2019 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌‌సీటీసికి రూ. 1,867 కోట్ల టర్నోవర్‌‌ మీద రూ. 221 కోట్ల నికర లాభం వచ్చింది.