
డబ్లిన్: పాకిస్తాన్ విమెన్స్ టీమ్‌తో రెండో టీ20లో ఐర్లాండ్ అమ్మాయిల జట్టు ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టి అద్భుత విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఐరిష్ టీమ్ నాలుగు వికెట్ల తేడాతో పాక్ జట్టును ఓడించింది. టాస్ గెలిచిన పాక్ అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. షవాల్ జుల్ఫికర్ (33), నటాలియా పర్వైజ్ (31), మునీబా అలీ (27), కెప్టెన్ ఫాతిమా సనా (23), ఐమన్ ఫాతిమా (23) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో కారా ముర్రే, లారా మెక్‌బ్రైడ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసి గెలిచింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో 6 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు 35/3తో డీలా పడింది. ఈ టైమ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (51), లారా డెలానీ (42) నాలుగో వికెట్‌కు 56 బాల్స్‌లో 76 రన్స్ జోడించి జట్టును ఆదుకున్నారు. చివర్లో రెబెకా స్టోకెల్ (34 నాటౌట్) ఆకట్టుకుంది. లాస్ట్ బాల్‌కు 4 రన్స్ అవసరం అవగా సైదా ఇక్బాల్ బౌలింగ్‌లో జేన్ మాగ్యూర్ (6 నాటౌట్) సిక్స్ కొట్టి ఐర్లాండ్‌కు విజయాన్ని అందించింది. స్టోకెల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం జరగనుంది.