- గంటల తరబడి ఎదురుచూసి వెనుదిరుగుతున్న కూలీలు
- రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా ఇదే పరిస్థితి
- ప్రతి రోజూ లక్షన్నర మందికిపైగా పనులకు దూరం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఉపాధి పనుల కోసం బుధవారం ఉదయం 7 గంటలకే 20 మంది కూలీలు పని ప్రదేశానికి వెళ్లారు. ఉదయం 10 గంటలు అయినా కూలీల ఐరిస్ క్యాప్చర్ కాలేదు. ఈ కేవైసీ రావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడంతో వారంతా ఇంటి బాట పట్టారు. మూడు రోజులుగా ఇలాగే జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను విడిచిపెట్టి ఉదయాన్నే పనికి వచ్చామని, ఈ విషయం ముందే చెప్తే వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లమని అంటున్నారు. పాత పద్ధతిలోనే హాజరుతీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
కరీంనగర్/నెట్‌వర్క్, వెలుగు : ఉపాధి హామీ పనిలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటెండెన్స్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో కూలీల ఈ–కేవైసీ అప్‌డేట్ ప్రక్రియ పూర్తి కావొచ్చినప్పటికీ.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ (ఎన్ఎంఎంఎస్) యాప్‌లో మాత్రం కూలీల డేటా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు.
మరోవైపు ఈ నెల 1 నుంచి అటెండెన్స్ కోసం గ్రూప్ ఫొటోకు బదులు ఎన్ఎంఎంఎస్ యాప్‌లో ఒక్కో కూలీ ఐరిస్ తీసుకోవాలని నిర్ణయించారు. కానీ మూడు రోజులు గడుస్తున్నా సగానికిపైగా కూలీల ఐరిస్ యాప్‌లో కాప్చర్ కావడం లేదు. దీంతో పనికి వెళ్లిన కూలీలు గంటల తరబడి వేచి ఉండి.. చివరకి పని చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇలా మూడు రోజులుగా పని ప్రదేశాల నుంచి తిరిగొస్తుండడంతో కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 1కి ముందు రోజు సుమారు 3.25 లక్షల నుంచి రూ.3.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరైతే ఐరిస్, ఈ– కేవైసీ లాంటి టెక్నికల్ సమస్యలతో మార్చి 1 నుంచి కూలీల సంఖ్య లక్షన్నర నుంచి 2 లక్షల నడుమే నమోదు అవుతోంది. అంటే రోజూ సుమారు లక్షన్నర మంది ఉపాధికి దూరంగా ఉండాల్సి వస్తోంది.
కనెక్ట్ కాని సర్వర్.. క్యాప్చర్ కాని ఐరిస్
ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్లు గతంలో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల గ్రూప్ ఫొటోను ఎన్ఎంఎంఎస్ యాప్‌లో తీసి మస్టర్ జనరేట్ చేసి పనులు చేయించేవారు. ఈ క్రమంలో అనర్హులు, జాబ్‌కార్డులేని వారు, పని చేయని వ్యక్తుల గ్రూప్ ఫొటో తీసి వారి పేరిట డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్లు డ్రా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి.
దీంతో ప్రతి కూలీ అటెండెన్స్‌ను ఐరిస్ (కంటి ఆధారిత) ద్వారా తీసుకుని తర్వాత ఒక గ్రూప్ ఫొటో కూడా తీసుకోవాలన్న నిబంధన విధించారు. పని ప్రారంభం కాగానే మొదట ఓ ఫొటో తీశాక.. నాలుగు గంటల తర్వాత మరో గ్రూప్ ఫొటో తీయాలి. ఈ విధానం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే చాలా మంది కూలీల ఈ–కైవైసీ పూర్తయినప్పటికీ యాప్‌లో వారి ఐరిస్ క్యాప్చర్ కావడం లేదు. 10 నుంచి 20 మంది ఉండే గ్రూపులో ఇద్దరు, ముగ్గురు కూలీల ఐరిస్ మాత్రమే క్యాప్చర్ అయితే మస్టర్ జనరేట్ చేయడం, గ్రూప్ ఫొటో తీయడం కుదరడం లేదు.
అంతేగాక సర్వర్ సమస్యతో కొందరు కూలీల ఈ–కేవైసీ డేటా నాట్ ఫౌండ్ అని వస్తోంది. మాన్యువల్‌గా ఎంట్రీ చేద్దామన్నా వర్కర్స్ డీటైల్స్ రావడం లేదు. సిగ్నల్ సమస్యతో నెట్‌వర్క్ సరిగ్గా లేని ఏరియాల్లో యాప్ కనెక్ట్ కావడానికి చాలా టైం పడుతోంది. ఒక్కో ఊరిలో 100 నుంచి 200 మంది వరకు కూలీలు పనులకు వస్తే వారందరి ఐరిస్, గ్రూప్ ఫొటోలు తీయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు టైం సరిపోవడం లేదు.
ఫీల్డ్ అసిస్టెంట్లపై పని భారం
అన్ని గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఒక్కో ఎఫ్‌ఏ మూడు, నాలుగు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. పనులు గుర్తించడం, కూలీలకు పని కల్పించడం, వారికి హాజరువేయడంతో పాటు మస్టర్లపై సంతకాలు తీసుకోవడం, వాటిని పైఅధికారులకు అప్పగించడం వంటి పనులు సైతం వీరే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక్కొక్కరి అటెండెన్స్ తీసుకోవడం ఫీల్డ్‌అసిస్టెంట్లకు మరింత భారంగా మారింది. కొత్త పంచాయతీల్లో ఎఫ్‌ఏలను నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
