- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎస్సీఆర్ సెంట్రల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) శనివారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా తన ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శిబిరంలో సంస్థకు చెందిన అధికారులు, ట్రైనీలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపుగా 60మంది రక్తదానం చేశారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సెంట్రల్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడారు. రక్తదాతల సేవా దృక్పథాన్ని కొనియాడారు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఇరిసెట్ కేవలం సాంకేతిక నైపుణ్యానికే కాకుండా, మానవీయ విలువలకు, సామాజిక బాధ్యతకూ పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
