లోకసభ, రాజ్య సభలో గాడ్సే పార్టీకి సపోర్ట్ చేసింది మీరే : రేవంత్ రెడ్డి

లోకసభ, రాజ్య సభలో గాడ్సే పార్టీకి సపోర్ట్ చేసింది మీరే : రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ కి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఊరు, పేరు లేదని, తెలంగాణలో చదువుకున్నది లేదని, ఆసలు ఆయనకు, తెలంగాణకు పేరు బంధం, పేగు బంధం కూడా లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పేరు డ్రామారావు అని ఆయన విమర్శించారు. చదువింది గుంటూరులో.. ఉద్యోగం అమెరికాలో అని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఏ హోదాలోనూ కొనసాగడానికి కేటీఆర్ కు సాంకేతికంగా, నైతికంగా అర్హత లేదని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుమారుడనే అర్హతతో డ్రామా రావు అన్ని రకాల హోదాలను అనుభవిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే సీఎం కేసీఆర్ కుటుంబం బిర్లా టెంపుల్, నాంప్లల్లి దర్గా దగ్గర బిక్షాటన చేసుకొని బతికొటేల్లని వ్యాఖ్యానించారు. తెలంగాణను అసలు అభివృద్ధి చేసింది ఇందిరా గాంధీ అని ఆయన కామెంట్స్ చేశారు.

బీహెచ్ఈఎల్, ఐడీబీఎల్.. లాంటి అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ వస్తే... మంత్రి కేటీఆర్ ఆమె కాళ్ళు మొక్కాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడే మీ పాపాలు తొలగుతాయని చెప్పారు. లోకసభ, రాజ్య సభలో గాడ్సే పార్టీకి సపోర్ట్ చేసింది మీరని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి నిధులు వద్దని కేవలం ప్రేమ చాలు అని చెప్పింది మీరన్నారు. అభివృద్ధి నమూనా అంటే ఏంటో చెప్పమన్న రేవంత్ రెడ్డి.. రాష్టంలో జరుగుతున్న అవినీతిని స్టడీ చేయాలా? పేపర్ లీకును స్టడీ చేయాలా?లేదంటే అత్యాచారాలపై స్టడీ చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటక ఎన్నికలపై..

కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల పదో తేదీన సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయని, అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందు ఉంచి ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కర్ణాటక పరిధిలోని చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రియాంక్ ఖర్గే ఎమ్మెల్యేగా, మంత్రిగా  కొనసాగారన్న ఆయన..  ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. మల్లికార్జున్ ఖర్కే 2014 నుంచి బీజేపీ వ్యతిరేక పాలనను ఎత్తిచూపుతున్నారని, మల్లికార్జున్ ఖర్గేపై కక్షగట్టి 2019లో ఓడించారని తెలిపారు. ప్రియాంక ఖర్గేను ఓడించడానికి జాతీయ నాయకులు అందరూ చిత్తాపూర్లో మోహరించారన్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఆయన ఓడిపోయేటటువంటి అవకాశం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడ బీజేపీకి ప్రియాంక ఖర్గేను ఓడించడానికి కనీసం అభ్యర్థి దొరకలేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

దీంతో ప్రియాంక ఖర్గేపై మణికంఠ రాథోడ్ అనే 30 కేసుల్లో తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోటీగా నిలబెట్టారని ఆయన ఆరోపించారు. మణికంఠ రాథోడ్ ను అక్కడి పోలీసులు నగర బహిష్కరణ చేశారని, అలాంటి వ్యక్తికి చిత్తాపూర్లో బీజేపీ సీటు ఇచ్చిందని విమర్శించారు. మల్లికార్జున్ ఖర్గే ఆయన కుటుంబ సభ్యులను చంపుతామని మణికంఠ రాథోడ్ బెదిరించారని, అందుకు సంబంధించిన ఆడియోలు కూడా బయటికి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మణికంఠను పార్టీ నుండి బహిష్కరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మణికంఠ రాథోడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. మల్లికార్జున్ ఖర్గే కుటుంబ సభ్యులను చంపితే అధికారంలోకి వస్తామని బీజేపీ అనుకోవడం భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు.