ఇజ్రాయెల్​పై మిసైళ్ల వర్షం..20 నిమిషాల్లో 5 వేలకు పైగా రాకెట్లతో దాడి

ఇజ్రాయెల్​పై మిసైళ్ల వర్షం..20 నిమిషాల్లో 5 వేలకు పైగా రాకెట్లతో దాడి
  •  దేశంలోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు 
  • గాజా స్ట్రిప్​పై ఎయిర్ స్ట్రైక్స్​తో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ జెట్​లు 
  • ఇజ్రాయెల్​లో 70 మంది.. గాజాలో 232 మంది మృతి 

జెరూసలెం: ఇజ్రాయెల్​కు, పాలస్తీనా హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. శనివారం ఉదయం ఇజ్రాయెల్​పై హమాస్ మిలిటెంట్లు ఇరవై నిమిషాల్లోనే ఐదు వేల రాకెట్లను ప్రయోగించారు. ఆ తర్వాత వెంటనే దేశంలోకి చొరబడి జనంపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి గాజా స్ట్రిప్​లో ఫైటర్ జెట్​లతో బాంబుల వర్షం కురిపించింది. మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్​లో 70 మంది చనిపోగా.. 500 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా స్ట్రిప్​లో 200 మంది చనిపోగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 

యూదులకు పర్వదినంలాంటి ‘సించాట్ తోరా’ అనే హాలీడే రోజు అది. అప్పుడే తెల్లారింది. అక్కడక్కడా జనం హుషారుగా రోజువారీ పనులు మొదలుపెడుతున్నారు. సరిగ్గా సమయం పొద్దున ఆరున్నర అయింది. ఇంతలో ఆకాశం నుంచి వేలాది రాకెట్లు వరుసగా దూసుకొచ్చాయి. చాలా రాకెట్లు ఆకాశంలోనే టపా టపా పేలిపోతున్నాయి. అక్కడోటి, ఇక్కడోటి మాత్రం జనావాసాల్లో పడుతూ భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో రాకెట్లు పడ్డ ప్రాంతాల్లో ప్రజలంతా ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇజ్రాయెల్ లోని అనేక చోట్ల శనివారం ఉదయం ఇదే భయానక వాతావరణం నెలకొంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ వైపు నుంచి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు ఇజ్రాయెల్ గగనతలం నుంచి వర్షంలా కురిశాయి. కేవలం ఇరవై నిమిషాల్లోనే ఐదు వేల రాకెట్లను హమాస్ మిలిటెంట్లు ప్రయోగించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ టౌన్ లలోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ప్రతిదాడులకు దిగిన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడులు, కాల్పుల్లో 70 మంది మరణించగా, 516 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు చనిపోగా, 1,610  మంది గాయపడ్డారు. 

భీకర యుద్ధం మొదలు.. 

హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడులతో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి భీకర యుద్ధం మొదలైంది. హమాస్ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంతో పాటు దేశమంతటా ప్రజలను అలర్ట్ చేస్తూ సైరన్లు మోగించారు. గాజా స్ట్రిప్​కు దగ్గరగా ఉన్న ప్రజలంతా ఇండ్లలోనే ఉండిపోవాలని, మిగతా ప్రాంతాల్లోని వారు బాంబు షెల్టర్లకు సమీపంలోనే ఉండాలని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్​ల తరహాలో పికప్ ట్రక్కులలో, మోటార్ బైక్​లపై ఇజ్రాయెల్​లోని దక్షిణాది టౌన్​లలోకి మిలిటెంట్లు ప్రవేశించారు. పారాచూట్లతో సైతం ఇజ్రాయెల్ భూభాగంలోకి దిగారు. అటు సముద్రం నుంచి పడవల్లో సైతం సాయుధ మిలిటెంట్లు దూసుకొచ్చారు. దాదాపుగా ఇజ్రాయెల్​పై ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లుగా మిలిటెంట్లు ఆ దేశ పట్టణాల్లోకి ప్రవేశించి జనంపైకి, బలగాలపైకి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. హమాస్ రాకెట్ దాడులు జరిగిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులు ప్రారంభించింది. 

‘అల్ ఆక్సా స్టార్మ్’ వర్సెస్ ‘ఐరన్ స్వార్డ్స్’ 

పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని, ఇజ్రాయెల్ నేరాలకు పాల్పడుతోందని, దీనికి ముగింపు పలుకుతామంటూ హమాస్ ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ పై ఈ దాడులు జరిగాయి. ‘‘మేం ఆపరేషన్ అల్ అక్సా స్టార్మ్ ను ప్రారంభించాం. ఫస్ట్ స్ట్రైక్ లో 20 నిమిషాల్లోనే 5 వేల మిసైల్స్, రాకెట్లు ప్రయోగించాం” అని హమాస్ మిలిటెంట్ లీడర్ మహ్మద్ డెయిఫ్ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. అల్ అక్సా ఫ్లడ్ యుద్ధంలో అనేక మంది శత్రు సైనికులను తమ అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ పట్టుకున్నాయంటూ హమాస్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే, హమాస్ ‘ఆపరేషన్ అల్ ఆక్సా స్టార్మ్’ పేరిట దాడులకు దిగగా.. ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ పేరుతో ప్రతిదాడులు ప్రారంభించింది.

‘ఐరన్ డోమ్’తో తగ్గిన ప్రాణనష్టం

గాజా వైపు నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో చాలావరకూ ఆకాశం లోనే పేలిపోయాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని సమర్థంగా అడ్డుకుంది. అటు నుంచి పైకి లేచిన రాకెట్ ఇటువైపు నేల పై పడేలోపే ఐరన్ డోమ్ మిసైల్స్ దూసుకెళ్లి పేల్చేశాయి. దీనివల్లే వేలాది మిసైళ్లు దూసుకొ చ్చినా వైపుగా ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని అంచనా వేస్తున్నారు. 

బందీలుగా విదేశీయులు..

ఇజ్రాయెల్​లోని విదేశీయులనూ హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది. మిలిటెంట్ల దాడుల్లో తమ దేశస్తులు గాయపడ్డారని, మరో 17 మంది నేపాలీలను బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయెల్ లో నేపాల్ రాయబారి చెప్పారని తెలిపింది. 

భారత పౌరులకు ఎంబసీ అడ్వైజరీ

టెల్​అవీవ్​: ఇజ్రాయెల్‌‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఆ దేశంలోని భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్‌‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులంతా అలర్ట్​గా ఉండాలి. అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌‌ పాటించాలి. అనవసరమైన ప్రయాణాలు మానుకోండి, అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ అధికారులను సంప్రదించాలి’’ అని ఎంబసీ ఒక ప్రకటనలో సూచించింది.

హమాస్​పై యుద్ధమే..!

వేలాది రాకెట్ దాడులు చేయడంతోపాటు తమ భూభాగం లోకి పెద్ద ఎత్తున మిలిటెంట్లను పంపిన హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్​పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధాన్ని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ ప్రజలారా.. మనం యుద్ధంలో ఉన్నాం. మిలిటరీ ఆపరేషన్ కాదు. యుద్ధం చేస్తున్నాం. ఇందులో మనం గెలుస్తాం. హమాస్ గతంలో ఎన్నడూ చూడనంతటి స్థాయిలో మూల్యం చెల్లించుకుం టుంది” అని ఆయన హెచ్చరించారు. దేశంలోకి మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో చొరబడ్డారని ఇజ్రాయెల్ నేషనల్ రెస్క్యూ సర్వీస్ వెల్లడించింది. కనీసం 21 చోట్ల స్పెషల్ ఫోర్సెస్ పోరాడుతున్నాయని, దక్షిణ ఇజ్రాయెల్​ను మొత్తం సీల్ చేశామని ఇజ్రాయెల్ పోలీస్ చీఫ్ యాకోవ్ షబ్తాయి చెప్పారు. ఇజ్రాయెల్​పై యుద్ధాన్ని ప్రారంభించి హమాస్ ఘోరమైన తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు. 

అండగా ఉంటం..  

ఇజ్రాయెల్ లో టెర్రరిస్టుల దాడులు జరుగుతున్నాయన్న వార్తలు విని షాక్ కు గురయ్యాను. ఇప్పుడు మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ బాధితులు, వాళ్ల కుటుంబసభ్యుల గురించే. ఈ కష్ట కాలంలో ఇజ్రాయెల్ కు అండగా ఉంటం. 
- ప్రధాని మోదీ 

తీవ్రంగా ఖండిస్తున్న.. 

ఇజ్రాయెల్ పై టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. 
-ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ 

టచ్​లో ఉన్నాం..

ఇజ్రాయెల్ పై హమాస్ టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నం. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉంటం. ప్రాణాలు కోల్పోయినోళ్లకు నివాళులు అర్పిస్తున్నం. ఇజ్రాయెల్ అధికారులతో టచ్​లో ఉన్నం.  
-అమెరికా వైట్ హౌస్

ఏమిటీ హమాస్?

జెరూసలెం: మిలిటరీ సామర్థ్యాలు ఉన్న పొలిటికల్ గ్రూప్ ‘హమాస్ (హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామి యా)’. దీన్ని 1987 డిసెంబర్‌‌‌‌లో పాలస్తీనియన్ క్లరిక్ షేక్ అహ్మద్ యాసిన్ ఏర్పాటు చేశారు. ఇదొక మిలిటెంట్ ఉద్యమం. గాజా స్ట్రిప్‌‌లోని 2 మిలియన్ల కు పైగా ప్రజలను పాలిస్తున్నది. ఇజ్రాయెల్‌‌పై సాయుధ తిరుగుబాటు చేస్తుంటుంది. హమాస్‌‌లో వివిధ రాజకీయ, సైనిక, సోషల్ విధులు నిర్వర్తించే నాయకత్వ సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్థానికంగా, మరికొన్ని అజ్ఞాతంలోఉంటూ పని చేస్తా యి. 1988లో హమాస్ తన చార్టర్‌‌ను ప్రచురించిం ది. ఇజ్రాయెల్‌‌ను నాశనం చేయాలని, చరిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. ఓస్లో ఒప్పందాలపై పీఎల్‌‌వో లీడర్ యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ పీఎం ఇజాక్ రాబిన్ సంతకాలు చేయడానికి 5 నెలల ముందు.. 1993 ఏప్రిల్​లో హమాస్ మొదటిసారిగా సూసైడ్​ బాంబు దాడి చేసింది. దీనిని డజనుకు పైగా దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్‌‌ కు ఇరాన్, తుర్కియే వంటి దేశాలు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నాయి.